చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమను వరదలు, వర్షాలు ముంచెత్తాయి. కరువు సీమలలో రాకాసి వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కడప, చిత్తూర్, అనంతపురం, నెల్లూర్ జిల్లాలు వర్షాలు, వరదల ధాటికి అతలాకుతలం అయ్యాయి. నదులు, చెరువుల్లోని నీరు గ్రామాలపైకి వచ్చి సర్వం నాశనం చేశాయి. ఏపీ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ నాలుగు జిల్లాల్లోని 119 మండలాల్లో మొత్తం 1990 గ్రామాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి, వీటిలో 211 గ్రామాలు పూర్తిగా నీటమునిగాయని తెలిపింది.
వరదల వల్ల చాలా మంది గల్లంతయ్యారు. వరదల కారణంగా ఏపీలో ఇప్పటి వరకు 44 మంది చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది. మరో 16 మంది గల్లంతయ్యారు. ఏపీలో ఈనెల 16,17 తేదీల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్రంగా వరదలు సంభవించాయి. వరదల్లో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు మరణించారు. కార్తీక పౌర్ణమి వేళ శివాలయంకు వెళ్లిన 10 మంది చనిపోయారు. ఇలా పలు గ్రామాల్లో ప్రజలు వరదల్లో చిక్కుకుని మరణించారు.