ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఆచంట గ్రామంలో ఇద్దరు ముసలివాళ్ళకు పెద్ద కష్టం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనే ఈ కష్టానికి కారణం. ఒకే రేషన్ కార్డుపై ఇద్దరు వృద్ధులు ఉన్నట్లయితే ఫింఛన్ నిలిపివేస్తామని అంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన నియమం, వారి పాలిట శాపంగా మారింది. తల్లీ కూతుళ్ళిద్దరి పేర్లు ఒకే రేషన్ కార్దుపై ఉన్నాయి. తల్లి పువ్వుల రాఘవులు, వయసు వందేళ్ళు, కూతురు తోరమ్ సరస్వతి, వయసు 80. తమకొచ్చే పింఛన్ డబ్బులతోనే ఇల్లు గడుపుకుంటూ వస్తున్నారు. వృద్ధాప్యంలో పింఛన్ డబ్బులే వారి జీవనానికి ఆసరా.
ఐతే ఒక రేషన్ కార్డుపై ఒక్కరు మాత్రమే పింఛన్ తీసుకోవాలన్న నియమం, వారికి కష్టంగా మారింది. ప్రతీ నెలా ఒకటవ తేదీన పింఛన్ ఇవ్వడానికి వచ్చే వాలంటీరు, ఈ నెల రాకపోవడంతో ఏం జరిగిందో ఆ వృద్ధులకు అర్థం కాలేదు. వెంటనే ఏం జరిగిందని వాలంటీరును ప్రశ్నించగా, ఇలా ఒకే రేషన్ కార్డుపై ఇద్దరి పేర్లు ఉన్నాయని, ఈ విధంగా పింఛను ఇవ్వడం కుదరదని అన్నారు. దాంతో ఏం చేయాలో అర్థం కాని వృద్ధులు బాధపడుతూ కూర్చున్నారు.
ఈ విషయం తెలుసుకున్న అక్కడి యువత, దీన్ని మంత్రి శ్రీ రంగనాథరాజు వద్దకు తీసుకెళ్ళారు. అంతా విన్న మంత్రిగారు కలెక్ఖర్ తో మాట్లాడి ఇద్దరికీ పింఛన్ వచ్చేలా చేయించారు. అంతేకాదు, ఇకపై ఆ వృద్ధులకు ఎలాంటి అవసరం వచ్చినా తాను చూసుకుంటానని మాటిచ్చారు. మంత్రిగారి ఆదేశాల ప్రకారం ఇటు వాలంటీర్లు కూడా ఆ తల్లికూతుళ్ళైన వృద్ధులకు పింఛను అందజేసారు. మొత్తానికి సమస్య తీరిపోయింది.