ఇకపై ఏపీలో సినిమా టిక్కెట్లను తామే అమ్ముతామని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా… జగన్ సర్కార్ తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం అవుతుంది. ఈ పరిస్థితుల్లో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పటివరకూ సినీపెద్దలు స్పందించకపోవడంపై రకరకాల ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం మంచిదా – కాదా అనే అంశంపై అభిప్రాయాలు చెప్పడంలో ఎవరికి వారు మౌనాన్నే తమ భాషగా చేసుకున్నారు.
అవును… టిక్కెట్లను తామే అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంపై టాలీవుడ్ పెద్దలు ఇంత వరకూ స్పందించలేదు. అయితే ఈ విషయాలపై సినీప్రముఖులతో అనుభందం ఉన్న యువజనశ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం స్పందించారు. దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమను కూలదోసే ప్రయత్నం జరుగుతోందని.. ప్రైవేటు వ్యాపారం అయిన సినిమా టిక్కెట్లు అమ్ముతామనడం సరైన నిర్ణయం కాదని సూటిగా చెప్పారు.
అయితే… ఏపీలో జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా.. ఆర్.ఆర్.ఆర్. తనదైన శైలిలో స్పందిస్తారు – ఆ నిర్ణయాలను తప్పుబట్టాడానికి తనవంతు ప్రయత్నం చేస్తారు! ఫలితంగా.. ఈ విషయంపై ఆర్.ఆర్.ఆర్. స్పందించినా కూడా పెద్ద విషయంగా అది ఉండదు! అయితే… ఈ విషయాలపై సినిమా పెద్దలు మాత్రం స్పందించాల్సిన అవసరం ఉంది!
అయితే… ఏపీ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న చిరంజీవి, జగన్ తో వ్యక్తిగత సంబంధాలున్న నాగార్జున, వైఎస్ ఫ్యామీలీతో సంబంధం ఉన్న మోహన్ బాబు లాంటి పెద్దలు కూడా ఈ విషయంపై మౌనంగానే ఉన్నారు. ప్రెస్ మీట్లు పెట్టకపోయినా… కనీసం సోషల్ మీడియాలో కూడా ఎవరూ తమ అభిప్రాయం చెప్పడానికి సిద్ధపడలేదు!
అంటే… జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ పెద్దలకు నచ్చిందని భావించాలా? అలా అయినా కూడా అభినందించడానికైనా పోటీపడి ట్వీట్లు పెట్టాలి కదా! ఈ నిర్ణయం సినీపెద్దలకు నచ్చలేదా? అంటే… ఆ అభిప్రాయం కూడా చెప్పలేదు! జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా స్పందించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు! సో… మౌనం అర్థంగీకారం అనుకోవడమే!