అపెక్స్‌ కౌన్సిల్ భేటీ తర్వాత నీటి పంచాయతీ మరింత ముదిరిందా…!

-

చాలాకాలం తర్వాత నీటి వివాదాలపై అపెక్స్‌ కౌన్సిల్ రెండోసారి భేటీ జరిగింది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలకు ఓ పరిష్కారం లభిస్తుందని అంతా భావించారు. ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్టు విషయంలో కొంతైనా క్లారిటీ వస్తుందనుకున్నారు. కానీ అపెక్స్‌ కౌన్సిల్ భేటీ తర్వాత పరిస్థితి మరింత ముదురుతోందే తప్ప.. సద్దుమణిగేలా కన్పించడం లేదనే భావన వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టుబట్టారు. తమ మాట వినకుంటే జూరాలకు దిగువన ఆలంపూర్‌-పెదమామూర్‌ వద్ద లిఫ్ట్‌ ప్రాజెక్టు నిర్మించి.. తాము రోజుకూ 3 టీఎంసీల నీటిని తోడేస్తామంటూ సీఎం కేసీఆర్‌ పెద్ద ప్రకటనే చేశారు. ఇప్పుడిదే అంశం ఏపీ ఇరిగేషన్‌ వర్గాల్లోనే కాకుండా.. రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమవుతోంది. కేసీఆర్‌ ఈ విధంగా ఎందుకు పంతం పడుతున్నారనే చర్చ జరుగుతోంది.

తెలంగాణలోని ప్రతిపక్షాల ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ రాయలసీమ లిఫ్ట్‌ విషయంలో ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. అపెక్స్‌ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు.. మినిట్స్‌ ప్రకారమే భవిష్యత్‌ వ్యవహారాలు.. ప్రాజెక్టుల అనుమతులు.. నీటి కేటాయింపులు ఉంటాయని అంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ కామెంట్లను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే చర్చ జరుగుతోంది. అయితే ఏపీ విషయంలో .. అందునా నీటి వివాదాల విషయంలో కేసీఆర్‌ కామెంట్లను అంత తేలిగ్గా తీసుకోకూడదనే భావన మెజార్టీ వర్గాల్లో కన్పిస్తోంది.

పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల వంటి వాటిని అక్రమంగా.. అనుమతుల్లేకుండా నిర్మించేసి.. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తోందోననే విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. అలాగే కాళేశ్వరం విషయంలో కూడా ఏపీ మరింత పకడ్బందీగా వెళ్లాలనే సూచనలు వస్తున్నాయి. ముఖ్యంగా నీటి సంబంధిత విషయాల్లో కేసీఆర్‌ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని.. అలాంటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి సంచలన కామెంట్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతుల్లేకుండా ప్రాజెక్టులు నిర్మించి నీటిని నిల్వ చేస్తే.. వాటి మీద ఏపీకీ హక్కులివ్వాలని తోపుదుర్తి కామెంట్‌ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news