మణిపూర్‌లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వారి స్వస్ధలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఇప్పటివరకు దాదాపు 157 మంది ఏపీ విద్యార్థులు మణిపూర్ లో చదువు తున్నట్టు గుర్తించారు. మరోవైపు మణిపూర్‌లోని తెలుగు విద్యార్ధులున్న కాలేజీలలో ఒక్కో కాలేజీ నుంచి ఒక్కో విద్యార్ధిని నోడల్ పాయింట్‌గా అధికారులు గుర్తించారు. వారిద్వారా ఆయా కాలేజీల్లోని ఏపీకి చెందిన మిగిలిన విద్యార్ధుల వివరాలను సేకరిస్తున్నారు. వీరిని ప్రత్యేక విమానం ద్వారా సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.
విద్యార్ధులను ప్రత్యేక విమానంలో తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి పౌరవిమానయాన శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. వ్రత్యేక విమానం ద్వారా ఏపీ విద్యార్ధులను తరలించడానికి పౌరవిమానయానశాఖ అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్నిగంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌరవిమానయానశాఖ అధికారులు తెలిపారు. ఒకవైపు పౌరవిమానయానశాఖ అధికారులతో సంప్రదిస్తూనే ప్రయివేటు విమానయాన సంస్ధలతోనూ అధికారులు మాట్లాడుతున్నారు. ప్రత్యేక విమానం ఏర్పాటుకు ఇండిగో విమానయాన సంస్ధతో అధికారులు సంప్రదిస్తున్నారు.