మూడు రోజుల పాటు తీవ్రతుఫాను కలవరం ఒక కొలిక్కి వచ్చింది. అయితే తుఫాను ప్రభావం మాత్రం ఇవాళ కూడా ఉంటుంది.శ్రీకాకుళం నుంచి కృష్ణా తీరం వరకూ విభిన్న వాతావరణం నెలకొని ఉంది. కొన్ని సార్లు వానలు కొన్ని సార్లు గాలులు విపరీతంగా విస్తూ భయానక వాతావరణం సృష్టించాయి. సోమవారం నుంచి గాలుల తీవ్రత మొదలవ్వడంతో విద్యుత్ సరఫరాకు పలు మార్లు అంతరాయం ఏర్పడింది.
తరువాత మంగళవారం నుంచి గాలులు కాస్త తగ్గినా వానలు మాత్రం దంచి కొట్టాయి. కొన్ని జిల్లాలలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అధికారులు అప్రమత్తమై చాలా వరకూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక శిబిరాల్లో మంచినీరు, భోజన వసతికి ఎటువంటి లోటు రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా సహాయక శిబిరాల్లో ఉన్న ఒక్కో కుటుంబానికి తక్షణ సాయం కింద రెండు వేల రూపాయలు ఇవ్వాలని కూడా ఆదేశించారు.
ఏదేమయినప్పటికీ అనేక ఉత్కంఠతల నేపథ్యంలో అస్తవ్యస్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తీవ్ర తుఫాను అసని తీరం దాటింది. మచిలీపట్నం – నరసాపురం మధ్య తీరం దాటింది. తుఫాను ప్రభావంతో వేల ఎకరాలలో పంటలు నేలవాలగా, ముగ్గురు మృతి చెందారు. తుఫాను ప్రభావం కారణంగా చాలాచోట్ల అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకార వాడల్లో జనం బిక్కు బిక్కుమంటూ గడిపారు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అన్న ఆందోళన వారిలో వ్యక్తం అయింది.
సర్వ సాధారణంగా వేసవిలో తుఫానులు ఏర్పడవు. ఏర్పడిన అవి వెంటవెంటనే బలహీన పడిపోతాయి. కానీ ఈ తుఫాను దశ ఒకంతట ఎవ్వరి అంచనాకు రాలేదు. మొదట్లో బాపట్ల దగ్గర తీరం దాటుతుంది అని అనుకున్నా ఆఖరికి మచిలీపట్నం – నరసాపురం మధ్యతీరం దాటి ప్రస్తతం బలహీన పడి ఉంది. తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకార గ్రామాలు ఇవాళ కూడా అప్రమత్తంగానే ఉండాలి.