వైసీపీలో చివరికి మిగిలేది జగన్.. జగన్ జీతగాళ్లేనని విమర్శలు చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిపై జగన్, వైసీపీ నేతలు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని.. టీడీపీలో చేరిన రాజంపేట పార్లమెంట్ వైసీపీ రైతు అధ్యక్షులు మద్దిరెడ్డి కొండ్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ మారిన 3 నెలల్లోనే 3 స్టేషన్లలో అక్రమ కేసులు బనాయించటమే కాక వైసీపీ కార్యకర్తలు అతని ఇంటిపై దాడికి పాల్పడ్డారని నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన రాజకీయ పార్టీలో చేరే హక్కుందని చెప్పారు. పార్టీ మారితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా? అని నిలదీశారు.
జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రజల హక్కుల్ని కాలరాస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారని.. జగన్ పాలన విధానాలు సొంత పార్టీ నాయకులకే నచ్చటం లేదన్నారు. రాష్ట్ర పునర్ నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యమని వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారు… ముందు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు చాలా మంది నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు.