విజయవాడ : మూడు రాజధానుల అంశంపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం మూడు చోట్ల రాజధానులు చేస్తామంటోందని.. ఒక రాజధాని అమరావతిలోనే సరిగ్గా అభివృద్ధి జరగటం లేదని పేర్కొన్నారు. మూడు చోట్ల రాజధానుల ప్రతిపాదన సరైంది కాదని.. రెండు చోట్ల రాజధానులు పెట్టినా పర్వలేదని తెలిపారు.
మూడు చోట్ల రాజధానులు ఉంటే ప్రజలకు సౌలభ్యంగానే ఉంటుందని.. కాని మూడు చోట్ల అభివృద్ధి చేయటం కష్టమని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం జగన్ ప్రధానిని కలిసి వివరించాలని.. జగన్‌కు పాలించే అవకాశం రావటం చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బ అని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో చేతులను కలపాలని సూచించానని.. జగన్ పాలన బాగానే చేస్తున్నారని వెల్లడించారు.
ఏపీకి కేంద్రం నుంచి ఆర్ధిక సహాయం కోసం నేను ప్రయత్నిస్తానని.. హిజాబ్ అంశం కర్ణాటక ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. మతం స్కూళ్ళల్లో వెళ్ళకూడదన్నది నా అభిప్రాయమని.. స్కూళ్ళల్లో బుర్ఖాలు ధరించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అన్ని మంచి బిల్లులకు వైసీపీ మాకు పార్లమెంట్‌లో మద్దతు ఇస్తోందని చెప్పారు.