ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల హఠాన్మారణం చెందడంతో ఆయన ప్రాతినిథ్య వహిస్తున్నఆత్మకూరు అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. అయితే రేపు ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి కాగా… నియోజకవర్గంలోని 278 పోలింగ్ కేంద్రాలకు నేడు సాయంత్రానికి పోలింగ్ సిబ్బంది చేరుకోనున్నారు. ఇదిలా ఉంటే… గౌతమ్ రెడ్డి మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో వైసీపీ తన అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డినే బరిలోకి దించింది. దీంతో సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఉప ఎన్నిక పోటీకి టీడీపీ దూరంగా ఉండిపోయింది. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థితో పాటు బీజేపీ సహా మొత్తం 14 మంది ఈ ఎన్నికల బరిలో నిలిచారు.
ఆత్మకూరు ఉప ఎన్నికలకు విస్తృతంగా ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కోసం 279 కేంద్రాల ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 1132 మంది పోలింగ్ సిబ్బంది, 148 మంది మైక్రో అబ్జర్వర్లు, వెబ్ క్యాస్టింగ్, మూడు కంపెనీల కేంద్ర పోలీసు బలగాలతో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు.