నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్ ని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని ఏర్దండి గ్రామస్తులు అడ్డుకున్నారు. వరద ప్రాంతాల పరిశీలనకు ఎంపీ వస్తున్నారని తెలుసుకున్న ఏర్దండి వాసులు ఆయన ముందు నిరసన తెలిపేందుకు యత్నించారు. తమ గ్రామానికి చెందిన ఓ భూ వివాదాన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన అరవింద్ ఆ తర్వాత దాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ కాన్వాయ్ కి రోడ్డుకు అడ్డంగా నిలుచున్నారు.
అయితే పోలీసులు గ్రామస్తులను పక్కకు తప్పించి ఎంపీ కాన్వాయ్ ని ముందుకు పంపించారు. ఈ సమయంలో అరవింద్ వెంట వచ్చిన బీజేపీ శ్రేణులు గ్రామస్తులు పై దాడికి దిగారని వార్తతో గ్రామస్తులు ఒక్కసారిగా రోడ్డుపైకి చేరుకున్నారు. వరద ప్రాంతాల్లో పరిశీలన ముగించుకొని తిరిగి వస్తున్న ఎంపీ కాన్వాయ్ నీ గ్రామస్తులు మరోమారు అడ్డుకున్నారు.
అయితే పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేయగా కాన్వాయ్ పై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ దాడిలో కాన్వాయ్ లోని ఓ కారు రెండు అద్దాలు పగిలిపోయాయి. చివరికి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు గ్రామస్తులను పక్కకు తప్పించి ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్ నీ అక్కడి నుంచి పంపించేశారు.