పబ్ జీ (PUB_G) గేమ్ ఆడొద్దని చెప్పినందుకు ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య వివాదం నెలకొంది. అది కాస్త కత్తితో దాడి చేసే వరకు వెళ్లింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంగళవారం వెలుగుచూసింది. గాయాలపాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా.. బాధితుడి కుటుంబ సభ్యులు కత్తితో దాడి చేసిన వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టారు.దీంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది.
పోలీసుల కథనం ప్రకారం.. కల్యాణదుర్గం నివాసి రామాంజనేయులు పబ్‌జీ ఆడుతున్నాడు. అదే టైంలో అటుగా వచ్చిన వన్నూరుస్వామి పబ్‌జీ చెత్త గేమ్ అని, ఆడి టైం వేస్ట్ చేసుకోవద్దని సూచించాడు. కానీ, రామాంజనేయులు వినిపించుకోకుండా దుర్బాషలాడాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరగగా రామాంజనేయులు కత్తితో వన్నూరుస్వామిపై దాడిచేశాడు. ప్రస్తుతం రామాంజనేయులు పరారీలో ఉండగా, వన్నూరుస్వామి కుటుంబీకులు నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రామాంజనేయులు కోసం గాలిస్తున్నారు.