ఏపీలో చెల్లని రూపాయి..బాబుని తగులుకున్నారుగా.!

-

చంద్రబాబు చాలారోజుల తర్వాత తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఖమ్మం వేదికగా భారీ సభలో పాల్గొన్నారు. అయితే ఆయన ఎవరిపైన విమర్శలు చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక్క మాట అనలేదు. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఊసు తీయలేదు. కేవలం తెలంగాణలో గతంలో టీడీపీ చేసిన కార్యక్రమాలని మాత్రమే చెప్పారు. అలాగే ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయిన టీడీపీ నేతలు మళ్ళీ తిరిగిరావాలని పిలుపునిచ్చారు.  అంతే అంతకుమించి బాబు ఎవరిని టార్గెట్ చేయలేదు.

అలాగే మళ్ళీ ఆయన తెలంగాణ రాజకీయాల్లో కనిపించడం కూడా కష్టమే. కానీ ఒక్కసారి ఖమ్మం సభ పెట్టగానే..బీఆర్ఎస్ నుంచి బాబుపై విమర్శల వర్షం కురిసింది. మంత్రి హరీష్ రావు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ మధ్య ప్రతిపక్షాలపై పెద్దగా దూకుడుగా వెళ్లని హరీష్..బాబుపై మాత్రం ఫైర్ అయ్యారు. ఏపీ ప్రజల చేతిలో ఛీత్కారాలు తిన్న చంద్రబాబు తెలంగాణలో ఏం ఉద్దరించడానికి ఇక్కడికి వస్తున్నారని, ఏపీలో చంద్రబాబు పాలన బాగోలేకే అక్కడి ప్రజలు చిత్తుగా ఓడించారని, ఆంధ్రాలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అని, చంద్రబాబు పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని ఆరోపించారు.

బీజేపీతో ఆంధ్రాలో పొత్తు పెట్టుకొనేందుకే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని, ఇక్కడ కూడా బలముందని చూపుకునే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబుతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటే భస్మాసుర హస్తమేనని అన్నారు. టీడీపీ రాజకీయాలు తెలంగాణలో చెల్లవని, చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే అన్నట్లు తెలంగాణలో కేసీఆర్ ఒక్కడే అని కవిత అన్నారు.

అటు ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం బాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబుది మొదట నుంచి రెండు నాల్కల ధోరణేనని… తెలంగాణ కాంగ్రెస్‌లో చంద్రబాబు స్లీపర్ సెల్స్ ఉన్నాయని రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏపీ వాడు కాదు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు తెలంగాణలోనే ఉన్నాయని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఒక్క ఖమ్మం సభతో మళ్ళీ తెలంగాణలో కూడా బాబు టార్గెట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news