హిందువులు ఆవును భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు తమ కుటుంబ సభ్యులలాగా పెంచుకుంటారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితె, తమిళనాడులోని ఓ ఆలయంలోని గోమాతకు అంగరంగ వైభవంగా సీమంతం వేడుకను చేసారు. రాష్ట్రంలోని కల్లకురిచ్చి జిల్లాలోని శంకరాపురం అనే గ్రామంలో గర్భిణిగా ఉన్న అంశవేణి అనే ఒక అవుకు ఈ వేడుక చేశారు. సీమంతం వేడుకకు అంశవేణిని బాగా అలంకరించారు ఇక్కడి ప్రజలు.
అంశవేణి సంరక్షణ చూస్తున్న ఆరుతరమ్ తిరుపురసుందరి అమ్మై ఆలయ ట్రస్ట్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఫంక్షన్ కు దాదాపు 500 మంది అతిథులు హాజరు కాగా వారందరికీ 24 రకాల వంటకాలతో రుచికరమైన విందు ఏర్పాటు చేశారు. వేడుకకు హాజరైన వారు ఆవుకు గిఫ్టులు కూడా అందించారు. మహిళలు ధరించే కంకణాలతో సహా 48 రకాల కానుకలు కూడా ఆవుకు అందాయి. సీమంతం వేడుకలో భాగంగా ఆలయ అర్చకులు అంశవేణికి స్నానం చేయించారు. అనంతరం పూలు, గంటలతో అంశవేణిని అలంకరించారు. కార్యక్రమం పూర్తయ్యాక వచ్చిన అతిథులంతా అంశవేణి నుంచి ఆశీర్వాదం పొందుకున్నారు.