టిఎస్ ఆర్టిసిలో టికెట్ల ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. దీంతో తెలంగాణ ప్రజలపై మరో భారం పడనుంది. కొద్ది రోజుల క్రితం బస్ చార్జీలు పెంచిన టిఎస్ ఆర్టిసి మరోసారి ట్రావెల్ 24 టికెట్స్ చార్జీల ధరలు పెంచింది. పెరుగుతున్న డీజిల్ ధరల భారాన్ని తగ్గించుకునేందుకు డీజిల్ సెస్ పేరుతో ఆ భారాన్ని ప్రయాణికులపై మోపింది. ట్రావెల్ 24 టికెట్ చార్జీల ధర ఇంతకుమునుపు 100 రూపాయలు ఉండేది. ఇప్పుడు దాన్ని 120 రూపాయలకు పెంచుతూ ఆర్టీసి నిర్ణయం తీసుకుంది.
ట్రావెల్ 24 టికెట్ తీసుకుంటే 24 గంటల పాటు నగర ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు. నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టిసికి కరోనా లాక్డౌన్,ఆంక్షలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. ప్రభుత్వం ఆర్టీసీకి కొంతమేర ఆర్థిక సాయం అందిస్తున్నప్పటికీ నష్టాలను తట్టుకొని సంస్థను నడవడం సవాలుగా మారింది. ఇదే సమయం లో డీజిల్ ధరలు బాగా పెరగడం ఆర్టీసీ కష్టాలను మరింత పెంచింది. దీంతో సంస్థ మనుగడ సాగించాలంటే కచ్చితంగా చార్జీలు పెంచక తప్పదనే పరిస్థితి నెలకొంది.