వివాదంలో బాలినేని !

-

వైసీపీ మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హ‌నం కోల్పోకూడ‌దు. అందులో ఇది  ఎన్నిక‌ల‌కు స‌మీపిస్తున్న స‌మ‌యం. అనుచిత ధోర‌ణిలో ఆగ్ర‌హావేశాలు తెచ్చేసుకుని ఇప్పుడేం మాట్లాడినా కాస్త కూడా క్ష‌మించ‌రు ప్ర‌జ‌లు. అందుకే మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ ప్ర‌జ‌లేం చెబుతున్నారో అందుకు విప‌క్షం నుంచి ఏ విధం అయిన తెర వెనుక స‌హకారం అందిస్తుందో వీట‌న్నింటినీ అర్థం చేసుకుని మాట్లాడితే త‌గాదాలు ఉండవు. ల‌డాయి ఉండ‌దు. బ‌డాయి క‌బుర్లకు తావే ఉండ‌దు. కానీ వైసీపీ లో విభిన్న వాతావ‌ర‌ణం ఉన్న దృష్ట్యా త‌రుచూ సంయ‌మ‌నం కోల్పోతున్న నేత‌ల‌కు అడ్డూ అదుపూ అన్న‌దే లేకుండా పోతోంది. సీఎం మాత్రం ఇవేవీ వ‌ద్ద‌ని త‌రుచూ గొడ‌వ‌లు వ‌ద్ద‌ని, స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌లు ఉంటే వినాలి అని, జ‌నం నిల‌దీసిన ఘ‌ట‌న‌లు ఉన్నా న‌వ్వుతూ స‌మాధానాలు ఇవ్వాల‌ని లేదంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆశించిన విధంగా ఫ‌లితాలు ఉండ‌వని ప‌దే ప‌దే హిత‌బోధ చేస్తున్నారు. కానీ జ‌గ‌న్ మాట‌కూ క్షేత్ర స్థాయిలో నాయ‌కుల ప్ర‌ద‌ర్శ‌న‌కు నోచుకుంటున్న ఆవేశాల‌కూ సంబంధం లేకుండానే పోతోంది.

మాజీ మంత్రి, ముఖ్య‌మంత్రి బంధువు బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి మ‌ళ్లీ వివాదాల్లో ఇరుక్కున్నారు.నిన్న‌టి వేళ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ఆగ్ర‌హంతో  ఊగిపోయారు. రైతుల స‌మ‌స్య‌ల గురించి ప్ర‌స్తావించిన సంద‌ర్భంలో ఆయ‌న స‌హ‌నం కోల్పోయి ఇదంతా టీడీపీ ఆడిస్తున్న డ్రామా అని నోటికివ‌చ్చిన విధంగా బూతులు తిట్టార‌న్న వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. వీటి సంగ‌తి ఎలా ఉన్నా ఎప్ప‌టిక‌ప్పుడు వివాదాల్లో ఇరుక్కోవ‌డంతో ప‌ద‌వి పోయిన నాటి నుంచి ఆవేశంతో ఊగిపోవ‌డంతో బాలినేని వ్య‌వ‌హారం అధినేత జ‌గ‌న్ కు త‌లనొప్పిగానే మారింద‌న్న అభిప్రాయం సొంత పార్టీలోనే వినిపిస్తోంది.

వాస్త‌వానికి రైతుల‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు చేశారు కానీ స‌రిగా డ‌బ్బులు చెల్లించ‌లేదు. ఇదే అన్ని చోట్లా ఉన్న స‌మ‌స్య. మ‌నోళ్లే రైతుల నోట్లో మ‌ట్టి కొట్టార‌న్ని అక్క‌డున్న వైసీపీ మ‌హిళా నేత ఒక‌రు మాట్లాడార‌న్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. మ‌రి! ఇది టీడీపీ నేత జ‌నార్ద‌న చేయిస్తున్న డ్రామా అంటారేంటి? ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో మాజీ మంత్రి దృష్టికి ప‌లు స‌మ‌స్య‌లు తీసుకువెళ్లిన సంద‌ర్భంగా కొన్ని ఆస‌క్తిదాయ‌క పరిణామాలు కొన్ని ఉద్రిక్త సంబంధ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version