తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కరీంనగర్ కోర్ట్. కోవిడ్ నిబంనలను ఉల్లంఘిస్తూ సభ నిర్వహించడంతో పాటు పోలీసులపై అనుచితంగా ప్రవర్తించడం వంటి కేసుల్లో రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. నిన్న అదుపులోకి తీసుకున్న బండి సంజయ్ ని పోలీసులు ఈరోజు కోర్టు ముందు హాజరుపరిచింది. బండి సంజయ్ కి రిమాండ్ విధించడంతో పాటు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. దీంతో ఆయన్ను కరీంనగర్ జైలుకు తరలించనున్నారు.
ఉపాధ్యాయ బదిలీలు రద్దు చేయాలని, ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ.. బండి సంజయ్ నిన్న కరీంనగర్ లోని ఆయన ఆఫీసులో దీక్ష చేస్తున్న క్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్ నిబంధనలకు వ్యతిరేఖంగా సభ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రాత్రి అంతా అదుపులో ఉంచుకున్న తరువాత ఈ రోజు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే బండి సంజయ్ తో పాటు మరో నలుగురిని కోర్ట్ లో హాజరుపరిచారు. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు 16 మందిపై కేసులు పెట్టారు.
ఇప్పటికే బండి సంజయ్ కి మద్దతు తెలుపుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీరును ఖండించారు. ఇటీవల బై ఎన్నికల్లో గెలిచిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వానికి పిచ్చి పట్టిందని.. పోలీసుల తీరుపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.