కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలను ఎలా దోచుకుంటుందో దేశమంతా చూస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ట్విటర్ వేదికగా ట్విట్టస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ పాలనలోని డబుల్ ఇంజిన్ సర్కార్ బీఆర్ఎస్ కారును తుక్కు తుక్కు(స్క్రాప్)గా చేస్తుందని బండి సంజయ్ విమర్శలు చేశారు. ప్రజలను దోచుకోవడం ద్వారా కల్వకుంట్ల కుటుంబ ఆదాయం ఎలా పెరిగిందనేది కూడా ప్రజలు చూస్తున్నారు, అందుకే ట్విట్టర్ టిల్లు కుటుంబం వణికిపోతోందని బండి విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పైకి శతృవులుగా నటిస్తూ ఢిల్లీలో మాత్రం దోస్తీ చేస్తున్నారని సంజయ్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లేనని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఇన్నిరోజులు విస్మరించిన సర్కార్.. కేవలం ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వంలో విలీనం చేసిందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించలేదని, రైతులు, యువత, 317 జీవో ద్వారా టీచర్లు ఇబ్బందులు పడినా ఏనాడూ ఈ సర్కార్ పట్టించకున్న పాపాన పోలేదన్నారు.