బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాణమిత్రులు అని అన్నారు. ఈ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని.. చెన్నైలో అఖిలపక్ష భేటీకి ఇద్దరూ కలిసి వెళ్లారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో సమావేశానికి కూడా ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెరవెనుక కలిసి పని చేస్తున్నాయని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ బీజేపీని దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారంలో సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా అంటూ రేవంత్ రెడ్డి, కేటీఆర్ లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు.