బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రెండు విడతలుగా నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ కావడంతో మూడో విడత యాత్ర కోసం సన్నద్ధమవుతున్నారు. దీనిని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు బండి సంజయ్. ఆగస్టు 2న యాదగిరి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామికి పూజలు చేసిన తర్వాత బీజేపీ చీఫ్ యాత్రను ప్రారంభిస్తారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని రెండు లోక్సభ, 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రోజుకు 15 కిలోమీటర్ల చొప్పున 20 రోజుల పాటు 300 కిలోమీటర్లు సాగుతుందని, ముందుగా భువనగిరి లోక్ సభ పరిధిలోని యాదగిరిగుట్ట (ఆలేరు అసెంబ్లీ)లో మొదలవుతుందన్నారు బీజేపీ నేతలు.
ఇబ్రహీంపట్నం మినహా ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగాం అసెంబ్లీ పరిధిలోని ప్రాంతాలతో పాటు వరంగల్ లోక్సభ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, హనుమకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతుందన్నారు. హన్మకొండ జిల్లాలోని భద్రకాళి టెంపుల్ వద్ద ఆగస్టు 21న ప్రజా సంగ్రామ యాత్ర ముగుస్తుంది. ఆ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే మూడు రూట్ప్లాన్లను రూట్ మ్యాప్కమిటీ రూపొందించింది. 12 నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగినప్పటికీ.. ఏయే ప్రాంతాల మీదుగా కొనసాగాలన్నది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదని చెప్పారు.