రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ పెద్దన్న పాత్ర పోషించాల్సిన స్పీకర్ రాజకీయ విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు బండి సంజయ్. స్పీకర్ పైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ్యులందరినీ సమన్వయం చేస్తూ సభ సజావుగా జరిగేలా పెద్దన్న పాత్ర పోషించాల్సిన స్పీకర్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున.. ఆయన తీరుపైనే శాసనసభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొత్తగా నియమితులైన పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లతోపాటు జిల్లా ఇంఛార్జ్ లతో బండి సంజయ్ సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు హాజరైన ఈ సమావేశంలో బండి సంజయ్ పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లకు అప్పగించిన లోక్ సభ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు శాసనసభ స్పీకర్ తీరుపై నిప్పులు చెరిగారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై వారం రోజులవుతున్నా… ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో నిమజ్జన ఏర్పాట్లు చేయలేదు. కనీసం ఏర్పాట్లపై చర్చ కూడా జరపలేదు. ఏమైనా అంటే కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంకు హిందూ పండుగలంటేనే షరతులు గుర్తుకొస్తాయి. ఇతర వర్గాల పండుగల విషయంలో ఇవేమీ పట్టవు. హిందువుల మధ్య గందరగోళం స్రుష్టించి ఆ పండుగలకు ప్రాధాన్యత లేకుండా చేసే కుట్ర చేస్తున్నరు. అందులో భాగంగా హిందువుల పండగలకు అనుమతుల విషయంలో ఇబ్బందులు పెట్టడంతోపాటు వారి మధ్య భయాందోళనలు స్రుష్టిస్తున్నారు.