ఒకవైపు విశాఖ ఉక్కు కర్మాగారం.. మరోవైపు విమానాశ్రయాల బేరం.. ఇంకోవైపు ఇంకా ఏం కావాలంటూ తన కార్పొరేట్ మిత్రులను బతిమలాడటం… ఇదీ భారతీయ జనతాపార్టీ పెద్దన్నగా వ్యవహరిస్తోన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) వైఖరి. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేద్రమోడీ సర్కార్ ప్రయివేటీకరణ రాగం వీనులవిందుగా ఆలపిస్తోంది. ప్రభుత్వరంగం సంస్థలు గుదిబండలుగా మారాయని, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని కేంద్రం పదే పదే చెబుతోంది. . వాటిని ప్రయివేటీకరించి వచ్చిన సొమ్ములను మౌలికసౌకర్యాల కల్పనకు ఉపయోగిస్తామని చెబుతున్నప్పటికీ కేంద్రానికి వస్తున్న ఆదాయం ఏమవుతోందని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నవన్నీ అమ్ముకుంటూ పోతే చివరికి ఎక్కడినుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందో ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా ఎన్డీయే సర్కార్ కన్ను విమానాశ్రయాలపై పడింది. 13 విమానాశ్రయాలను గంపగుత్తగా అమ్మకానికి పెడుతోంది. కావల్సినవారు బిడ్డింగ్‌లో పాల్గొనడమే తరువాయి.
లాభాలొచ్చేవి.. నష్టాలొచ్చేవి.. రెండూ కలిపే అమ్మకం
దేశంలో తిరుచ్చి, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, వారణాసి, అమృతసర్ విమానాశ్రయాలు లాభాల్లో ఉన్నాయి. సేలం, ఝార్సుగూడ, జబల్పుర్, జలగావ్, కాంగ్రా, కుషినగర్, గయ విమానాశ్రయాలు నష్టాల్లో ఉన్నాయి. నష్టాల్లో నడుస్తున్న విమానాశ్రయాలను విక్రయానికి పెడితే కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే లాభాల్లో ఉన్న వాటితో కలిపి టోకుగా విక్రయించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. అప్పుడైతే సామర్థ్యం ఉన్న బిడ్డర్లు ముందుకు వస్తారనే భావనతో ప్రభుత్వం ఉందని అధికారులు చెబుతున్నారు.
వడ్డించేవాడు మనవాడైతే…
లాభాలు – నష్టాల్లో ఉన్న 13 విమానాశ్రయాలను కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం విక్రయించనుందని సమాచారం. ‘విమానాశ్రయాల విక్రయ ప్రతిపాదన పెట్టాం..వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటికి బిడ్లు ఆహ్వానించే అవకాశం ఉంది’ అని ఓ ప్రభుత్వ అధికారిని పేర్కొంటూ ఆంగ్ల పత్రికలు వార్తలు రాస్తున్నాయి. బిడ్డింగ్‌లో పాల్గొనేవారు లాభాల్లో – నష్టాల్లో ఉన్న విమానాశ్రయాలకు కలిపి బిడ్ వేయాల్సి ఉంటుంది. ఆస్తులను విక్రయించడం ద్వారా రూ.20 వేల కోట్లు సమీకరించాలన్నది విమానయాన శాఖ లక్ష్యం. 2019లో ఆరు విమానాశ్రయాలకు నిర్వహించిన వేలంలో అదానీ పోర్ట్స్ అన్నింటినీ దక్కించుకుంది. ఈ 6 విమానాశ్రయాల విక్రయ సమయంలో ఏయే నిబంధనలను వర్తింపచేశారో ఈ 13 విమానాశ్రయాల విక్రయానికి కూడా అవే నిబంధనలను వర్తింపచేయనున్నారు. వడ్డించేవాడు మనవాడైతే వడ్డనలో ఎక్కడ కూర్చున్నా భోజన పాత్రలోకి మనకు కావల్సినవన్నీ అడిగిన వెంటనే వచ్చేస్తాయి. ఇంకా అందులో సందేహమెందుకు?