శాసన మండలిలో ఇప్పటి వరకు పైచేయి సాధిస్తూ.. వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు మరో ఛాన్స్ వచ్చిందా? ఇక, ఇప్పుడు చెలరేగిపోవడం ఖాయమా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్.. రాష్ట్రం లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదల చేసింది. రాజధాని ఉద్యమం జరుగుతున్న సమయంలో టీడీపీకి చెంది న కీలక నాయకుడు, ఎస్సీ వర్గానికి చెందిన నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు.. మార్చిలో తన ఎమ్మెల్సీ పద వికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన వైసీపీకి మద్దతిచ్చారు.
ఈ స్థానానికి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అయింది. తాజాగా షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ నెల 25న నామినేషన్లు, 26న పరిశీలన, 29వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చింది. అదే సమయంలో వచ్చే నెల 6న ఎన్నికలు నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం ఫలితం కూడా విడుదల కానుంది. ఈ పరిణామం.. నిజానికి అధికార పార్టీ వైసీపీ ఊహించింది కాదు. ఎందుకంటే.. మండలి రద్దు అయిపోతుందని జగన్ ప్రభుత్వం భావించింది. కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్సీఉప ఎన్నిక విషయం తెరమీదికి వచ్చింది.
ఇక, ఇప్పటి వరకు వైసీపీ దూకుడుకు ఎలాగైనా కళ్లెం వేయాలని భావించి.. విఫలమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు చక్కటి అవకాశం వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. మండలిలో ఎన్నికలు కాబట్టి.. చట్ట సభల సభ్యుడిగా అప్పట్లో డొక్కా ఎన్నికైనందున బాబుకు మండలిలో సభ్యత్వం ఎక్కువగా ఉన్నందున ఆయనదే పైచేయి అవుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది.
అయితే, అసెంబ్లీలో వైసీపీకి మెజారిటీ ఎక్కువగా ఉన్నందున వైసీపీ విజయం ఖాయమని అంటున్నారు. కానీ, ఈ విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి.. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ఛాన్స్ ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం తాంబూలాలైతే ఇచ్చేసింది!!