క్రెడిట్ గేమ్‌లో ప‌వ‌న్‌కు ఆ ఇద్ద‌రు షాక్ ఇస్తారా…!

-

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ స‌త్తా ఇప్పుడు తేలిపోతుందా? ఆయ‌న రాజ‌కీయంగా వేసిన అడుగులు స‌క్సెస్ అవుతాయా? వ‌్యూహం ఫ‌లిస్తుందా? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. వ‌చ్చే ఆదివారం ప‌వ‌న్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో ఇసుక కొర‌త కార‌ణంగా ఇబ్బంది ప డుతున్న భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా విశాఖ లాంగ్ మార్చ్‌కు ఆయ‌న పిలుపు ఇచ్చారు. దీనిని భారీ ఎత్తున నిర్వ హించాల‌ని ప‌వ‌న్ వ్యూహంగా పెట్టుకున్నారు. ఫ‌లితంగా ఇటీవ‌ల ఎన్నిక‌ల‌లో త‌న పార్టీ కోల్పోయిన ప్ర‌జాద‌ర‌ణ‌ను పుంజు కునేం దుకు ఇది ప‌నికి వ‌స్తుంద‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే దీనిని భారీ ఎత్తున నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్నా రు.

అంతేకాదు, ఈ విశాఖ లాంగ్ మార్చ్‌ను రాజ‌కీయంగా మ‌లుచుకుని రాబోయే రోజుల్లో త‌న స‌త్తా నిరూపించుకోవాల‌ని ప‌వ‌న్ అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌ను ఒక్క‌డే కాకుండా గ‌తంలో త‌న మిత్రులు, త‌న ప్ర‌చారంతో గెలుపు గుర్రం ఎక్కార‌ని, అధికారంలోకి వ‌చ్చార‌ని ప్ర‌చారం చేసుకున్న బీజేపీ, టీడీపీల‌కు ప‌వ‌న్ ఇప్పుడు ఆహ్వానం పంపారు. స్వ‌యంగా ఆయ‌న ఫోన్ చేసి బీజేపీ చీఫ్ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఆహ్వానించిన‌ట్టు తెలిసింది. అయితే, దీనికి వారు సానుకూలంగా స్పందించార‌ని ప‌వ‌న్ విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న స్ప‌ష్టం చేసింది. అయితే, ఇది ప‌వ‌న్ చెప్పినంత తేలిక కాద‌ని దీని వెనుక చాలా జ‌రిగింద‌ని అంటున్నారు.

బీజేపీ, టీడీపీల‌తో 2014లో పొత్తు పెట్టుకు న్న ప‌వ‌న్ ఆ పార్టీల‌కు ప్ర‌చారంలో స‌హ‌క‌రించారు. అయితే, తాను మాత్రం ఎన్నిక‌ల కు దూరంగా ఉన్నారు. ఒక ర‌కంగా ఆ ఏడాది రాష్ట్రంలో బాబు ప్ర‌భుత్వ ఏర్పాటులో ప‌వ‌న్ బాగానే ప‌నిచేశారు. అయితే, త‌ర్వాత ప‌వ‌న్‌కు ఎప్పుడూ టీడీపీ అవ‌స‌రం రాలేదు. అదేస‌మ‌యంలో ఆయ‌నకు బీజ‌పీతోనూ అవ‌స‌రం రాలేదు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్ని కల్లోనూ ఆయ‌న ఈ రెండు పార్టీల‌కూ దూరంగా క‌మ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. దీంతో అటు టీడీపీ, ఇటు బీజేపీలు ఒంట‌రిగానే పోరుకుదిగాయి. అయితే, ఇప్పుడు ప‌వ‌న్ తాను చేప‌ట్టిన విశాఖ లాంగ్ మార్చ్‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని స్వ‌యంగా ఫోన్ చేయ‌డం ఆస‌క్తిగా మారింది.

గ‌తంలో త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు స‌హ‌క‌రించిన ప‌వ‌న్‌కు టీడీపీ, బీజ‌పీలు ఇప్పుడు స‌హ‌క‌రిస్తాయా?  లేదా? అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది. దీనిపై ఇప్ప‌టికే బీజేపీ నుంచి క్లారిటీ వ‌చ్చింది. పవన్ కల్యాణ్‌ సభలో పాల్గొనాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు లేదని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసింది మొదట బీజేపీయేనని తెలిపారు. ఇసుక సమస్యపై గవర్నర్‌ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా బీజేపీయేనని వెల్లడించారు. సమస్యకి సంఘీభావం తెలుపుతున్నామే తప్ప వేరే పార్టీలకు కాదని స్పష్టం చేశారు. పవన్‌తో వేదికను పంచుకోమని విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు.

ఇక‌, చంద్ర‌బాబు కూడా ఈ విష‌యంలో క‌లిసి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిన టీడీపీ ఇప్ప‌టి వ‌ర‌కు అన్న క్యాంటీన్లు, ఆత్మ‌కూరు, వ‌ర‌ద‌లు, రాజ‌ధాని అంటూ అనేక విష‌యాల‌పై ఉద్య‌మాలు చేప‌ట్టినా.. అంత‌గా ఆశించిన ఫ‌లితం రాలేదు. త‌మ్ముళ్లు ఏక‌తాటిపై నిల‌వ‌లేదు. దీంతో ఇప్పుడు ఇసుక స‌బ్జెక్టును తీసుకుని పోరాడ‌డం ద్వారా పుంజుకోవాల‌ని బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి బాబు త‌న‌యుడు లోకేష్ ఒక రోజు దీక్ష కూడా చేసి కార్మికుల‌కు బాస‌టగా నిలిచారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప‌వ‌న్ చేసే లాంగ్ మార్చ్‌కు మ‌ద్ద‌తిస్తే.. మొత్తం క్రెడిట్ ప‌వ‌న్ ఖాతాలో ప‌డే ప్ర‌మాదం ఉంటుంద‌ని త‌మ్ముళ్లు అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌కు ఈ రెండు పార్టీలూ స‌హ‌క‌రించే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంద‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news