బీహర్ రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం రక్కసి కాటేసింది. నలంద జిల్లాలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించారు. కల్తీ మద్యం తాగడం వల్లే చనిపోయారని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటన నలంద జిల్లా సోహ్సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగిన తర్వాత బాధితుల ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని.. తరువాత మరణించారని తెలుస్తోంది.
గతంలో కూడా బీహార్ లో కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో మరణించారు. బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. మద్యం తయారు చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తోంది. ఇదే ప్రస్తుతం కొంతమందికి ఆదాయంగా మారింది. అక్రమంగా మద్యాన్ని తయారు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. చాలా మంది తక్కువ ఆదాయం కలిగిన పేద వారు ఇలా కల్తీ మద్యాన్ని తాగి చనిపోతున్నారు.