ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాలకు ఇంఛార్జ్‌లను నియమించింది బీజేపీ కేంద్ర నాయకత్వం. ఆ విధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని తమిళనాడుకు పంపుతున్నారు కమలనాథులు. ఈ అప్పగింతలు.. బాధ్యతలు చెప్పుకోవడానికి బాగానే ఉన్నా.. పార్టీ మాత్రం ఆయనకు పెద్ద టాస్కే అప్పగించిందా అన్న చర్చ బీజేపీ నేతల్లో వినిపిస్తుంది. తమిళనాడులో గతంలో ఒక్క సీటు సాధించలేని బీజేపీ కిషన్‌రెడ్డితో చేస్తున్న ప్రయోగం ఆసక్తిరేపుతుంది…
గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైన కిషన్ రెడ్డిని లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా బరిలో దించింది బీజేపీ. కిషన్‌రెడ్డి విజయం సాధించి ఆ తర్వాత మోడీ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. కీలకమైన హోంశాఖలో సహాయ మంత్రిగా ఉన్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవడంలో తన వంతు పాత్ర పోషించారు. బీజేపీ వరకు వస్తే.. తెలంగాణలో ఉన్న పరిస్థితులు వేరు.. తమిళనాడులో నెలకొన్న పరిణామాలు వేరు. అరవ రాజకీయాలు ఎప్పుడూ డిఫరెంట్‌గా ఉంటాయి.
తమిళనాడు రాజకీయాలను గమనిస్తే అక్కడ బీజేపీకి అంత సీన్ లేదు. అంతెందుకు అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేదు. కానీ తమిళ రాజకీయాలలో బీజేపీ అగ్రనాయకత్వం ముద్ర మాత్రం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలని చూస్తోన్న బీజేపీ కేంద్ర నాయకత్వం..జయలలిత మరణం తర్వాత తమిళనాడు పరిణామాలను అనుకూలంగా మాలుచుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. అక్కడి అన్నాడీఎంకే ప్రభుత్వానికి కేంద్రం ఆశీస్సులు కూడా ఉన్నాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంతో బీజేపీ పొత్తు కూడా పెట్టుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
ఢిల్లీ బీజేపీ నేతలు ఒక ప్లాట్‌ఫారం అయితే తమిళనాడులో వేశారు. ఇప్పుడు ఎన్నికల ఇంఛార్జ్‌గా కిషన్‌రెడ్డిని నియమించి పెద్ద బాధ్యతలే అప్పగించారు. అన్నా డీఎంకేతో సమన్వయం చేసుకోవడం.. కలిసి వచ్చే ఇతర పార్టీలతో మాట్లాడటం సవాలే. తమిళనాడులో చిన్నా చితకా పార్టీలు భారీగానే ఉన్నాయి. పొత్తులే కాదు.. సీట్ల కేటాయింపులోనూ వారిని ఒప్పించాల్సి ఉంటుంది. చివరగా అందరినీ ఒకే తాటిమీదకు తీసుకు రావడం కీలకం.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమిళనాడులో ఈ దఫా ఎన్నికల్లో బీజేపీకి గౌరవ ప్రదమైన సీట్లు సాధించడం మరో టాస్క్. బీజేపీకి పట్టున్న ప్రాంతాలను పొత్తులో భాగంగా దక్కించుకోవడం.. అక్కడ బలమైన అభ్యర్థుల ఎంపిక కూడా కిషన్‌రెడ్డికి పరీక్ష పెడతాయని భావిస్తున్నారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆర్థిక వనరుల సమీకరణ.. శ్రేణుల సమాయత్తం.. సంఘ్ పరివార్ క్షేత్రాలతో మాట్లాడటం.. వ్యూహ రచన కిషన్‌రెడ్డికి పెద్ద సవాలే. మరి తమిళనాడు ఎన్నికల్లోనూ ఇంఛార్జ్‌గా కిషన్ రెడ్డి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.