రాష్ట్రంలో ఎదగాలని నిర్ణయించుకున్న బీజేపీకి చాలా అవకాశాలు అందివస్తున్నాయి. అయితే, వాటిని అందిపుచ్చుకునే చొరవ, ఉత్సాహం ఎక్కడా ఆ పార్టీలో కనిపించడం లేదు. దీంతో పార్టీ ఎదుగుదలపై అన్నీ ప్రశ్నార్థకాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేసమయంలో తాము ఏం చేసినా చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడీగానే ఉంది. గతంలో మాదిరిగా కేంద్రం నిధులిచ్చినా.. ఊరికేనే ఇస్తున్నారా? అని అడిగే సీఎం లేడు. పైగా కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు కేంద్రం చెబుతున్న పేరునే పెడుతున్నారు.
దీంతో బీజేపీకి మరింతగా ఎదిగేందుకు తమ వ్యూహాలను అమలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇక, పోలవరం విషయంలో ఏదో ఒక టి తేల్చి.. మేమే కడతాం.. మీరు తప్పుకోండిఅన్నా కూడా రాష్ట్ర ప్రబుత్వం దానికీ సిద్ధంగానే ఉంది. దీంతో పోలవరంలో ఇప్పటి వరకు ఏం జరిగినా.. ఇకపై జరిగేదాన్ని బీజేపీ తనఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే, ఈ విషయంలోనూ రాష్ట్ర , కేంద్ర బీజేపీలు ఉత్సాహం చూపించడం లేదు. ఇక, ప్రత్యేక హోదా ఎలాగూ ఇవ్వనన్నారుకాబట్టి.. దాని తాలూకు ఫలితాన్ని అయినా.. ఇప్పడు అందించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే.. బీజేపీపై నమ్మకం కలుగుతుంది.
మరోకీలక విషయం. అమరావతి రాజధాని విషయంలోబీజేపీ స్టాండ్‌ను స్పష్టం చేయడం. ఈ విషయంలో బీజేపీ అసలు ఏమని అనుకుంటోంది. దానికి ఉన్న మార్గం ఏంటి? అనేవిషయాలను వెల్లడిస్తే.. ఇప్పుడున్న మేఘాలు తొలిగిపోయి.. బీజేపీకి మరింత ప్రజాదరణ దక్కుతుంది. కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుకు ఎవరికీ ఎలాంటి అడ్డు లేదు. దీనికి టీడీపీ కూడా రెడీగానే ఉంది. ఎటొచ్చీ అమరావతిని మార్చడంపైనే అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ కలుగజేసుకుని పెద్దన్న పాత్ర పోషించి సమస్యను పరిష్కరించి.. ప్రజల్లోకి వెళితే. మంచి ఊపు వస్తుందనేది విశ్లేషకుల మాట. కానీ, ఆ దిశగా ప్రయత్నం మాత్రం చేయడం లేదు. మేం ఏమీ చెయ్యం.. ఓట్లు మాత్రం మాకే కావాలి.. అంటే.. ఎవరు మాత్రం ఊరికే స్పందిస్తారనే చిన్న విషయాన్ని పార్టీ పరిగణనలోకి తీసుకుంటే మంచిదనేది వీరి సూచన. మరి కమల నాథులు ఆదిశగా ఆలోచన చేస్తారా? చూడాలి..!