రోజురోజుకూ తెలంగాణలో కమలం పార్టీ లీడ్ పెంచుకుంటుంది…ఎప్పుడు ఐదు లోపు సీట్లకు పరిమితమయ్యే బీజేపీ..ఈ సారి తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిందో అప్పటినుంచి బీజేపీ దూకుడు పెరిగింది. తర్వాత దుబ్బాక ఉపఎన్నికలో గెలవడం, అలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం, తర్వాత ఈటల రాజేందర్ లాంటి బలమైన నేత బీజేపీలోకి రావడం, హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలవడంతో…బీజేపీ ఊహించని విధంగా ఫామ్ లోకి వచ్చింది.
ఇక నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. ఆ దిశగానే ఎక్కడకక్కడ బలపడేలా వ్యూహాలు రచిస్తుంది…ఇదే క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ బాగా పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా అంటే టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. కానీ ఆ కంచుకోటలో ఇప్పుడు టీఆర్ఎస్ ఎదురీతుంది…అలాగే కమలం అనూహ్యంగా పుంజుకుంటుంది. ఎప్పుడైతే కరీంనగర్ పార్లమెంట్ సీటులో బండి సంజయ్ గెలిచారో…అప్పటినుంచి జిల్లాలో సీన్ మారిపోయింది.
అలాగే అదే కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటల బీజేపీలోకి వచ్చి హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలవడంతో జిల్లాలో కారుకు చుక్కలు కనబడటం మొదలయ్యాయి. ఎలాగో హుజూరాబాద్ లో బీజేపీకే లీడ్ ఉంది. అటు కరీంనగర్ అసెంబ్లీలో కూడా బీజేపీ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ నుంచి బండి సంజయ్ ఓడిపోతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక…పార్లమెంట్ కు పోటీ చేసి గెలిచారు…ఇక వచ్చే ఎన్నికల్లో బండి మళ్ళీ కరీంనగర్ అసెంబ్లీలో పోటీ చేసి సత్తా చాటే ఛాన్స్ ఉంది.
ఒకవేళ కరీంనగర్ కాకపోతే వేములవాడలో బండి పోటీ చేయొచ్చని తెలుస్తోంది. అక్కడైనా బీజేపీకి సానుకూల పవనాలే వీస్తున్నాయి. అంటే ఈ మూడు స్థానాల్లో బీజేపీకి లీడ్ కనిపిస్తోంది. మరి చూడాలి ఇంకా జిల్లాలో బీజేపీ ఎన్ని స్థానాలపై పట్టు సాధిస్తుందో?