తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం.. దోబూచులాడుతోంది. అధికార టీఆర్ఎస్ గెలుపు గుర్రం ఎక్కుతుందా ? లేక.. గత 2018 ఎన్నికల్లో కనీస మార్కు ఓట్లు కూడా సాధించలేని పరిస్థితి నుంచి నేడు భారీ ఎత్తున పోటీ ఇచ్చే స్తాయికి ఎదిగింది. ఇక, కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో బీజేపీదే కీలక రోల్‌గా కనిపిస్తోంది. ఇక్కడ నుంచి పోటీచేసిన బీజేపీ నాయకుడు, యువ నేత రఘునందన్‌రావు.. దూకుడుకు మంచి మార్కులే పడ్డాయి.
రఘునందన్ ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కుతారా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. యువతలో మాత్రం మంచి జోష్ నింపారు. బీజేపీలో యువతకు ప్రాధాన్యం దక్కుతుందనే విషయంలోను, ప్రజల్లోనూ యువ నేతలకు మంచి ఫాలోయింగ్ ఉంటుందనే విషయంలోనూ దుబ్బాక ఓటర్లు మంచి వ్యూహాత్మకంగా అడుగులు వేశారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. యువతకు అవకాశం ఇస్తే.. ఎలాంటి ఇబ్బందీ ఉండదని.. పైగా దూకుడుగా వెళ్తారనే విషయం ఈ ఉప ఎన్నిక స్పష్టం చేసింది.
2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ 62 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలవడంతో పాటు బీజేపీ డిపాజిటి దక్కించుకోలేక మూడో స్థానంలో ఉన్న చోట ఇప్పుడు గులాబీ దళానికి ఈ స్థాయిలో చెమటలు పట్టించడం అంటే మామూలు విషయం కాదు. అదే సమయంలో వచ్చే 2023 ఎన్నికల్లోనూ దుబ్బాక ఓటరు తీరు.. బీజేపీకి బలంగా మారనుంది. ప్రజా సమస్యలపై పోరాడితే తప్ప ప్రజల మనసులు గెలవలేమనే సంకేతాలు దుబ్బాక ఓటరు విస్పష్టంగా చెప్పేశాడు.
ఇప్పటి వరకు బీజేపీ అనుసరించిన మార్గానికి ఇది భిన్నమైన వాదన. కులం, మతం, ప్రాం తం ప్రాతిపదికగా సాగిన.. బీజేపీ రాజకీయం.. దుబ్బాక రాజకీయంతో మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. ప్రజా సమస్యలకే నేతలకు, పార్టీలకు అంతిమ లక్ష్యమనే సూత్రాన్ని.. స్పష్టం చేసిన ఈ ఉప పోరు.. బీజేపీలో జోష్ నింపుతుందనడంలో సందేహం లేదు. అలాగే తెలంగాణలోని యువత బీజేపీ వైపు మొగ్గు చూపుతోందన్న సంకేతాలు కూడా దుబ్బాక ఓటరు నాడిని బట్టి తెలుస్తోంది.