ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు గాని..ఆయన చుట్టూ మాత్రం ఎప్పుడు రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. 2009లో మాత్రమే ఎన్టీఆర్ టీడీపీ తరుపున ప్రచారం చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. కానీ తన కట్టే కాలే వరకు టీడీపీతోనే ఉంటానని చెప్పి…సైలెంట్ అయిపోయారు. ఇక ఇటీవల ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా ఎన్టీఆర్ ఆచి తూచి స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ శ్రేణులు తారక్‌ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. అసలు ఎన్టీఆర్ మద్ధతు తమకు అక్కర్లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు.
అయితే ఇలా ఎన్టీఆర్‌పై టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతుండటంతో..తారక్‌కు వైసీపీ శ్రేణులు మద్ధతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ పేరుతో టీడీపీలో చిచ్చు లేపారు. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్ధతు దక్కించుకునేందుకు ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండుగా చీలిపోయారు. కొందరేమో టీడీపీకి మద్ధతు ఇస్తుంటే..మరికొందరు వైసీపీకి మద్ధతు ఇస్తున్నారు. అయితే పూర్తిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్ధతు దక్కించుకోవడానికి వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది.
ఇదే క్రమంలో మధ్యలోకి బీజేపీ వచ్చి చేరింది. ఎప్పుడైతే అమిత్ షా..ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారో అప్పటినుంచి..ఎన్టీఆర్ తమవాడు అని బీజేపీ ప్రచారం చేసుకుంటుంది. ఎన్టీఆర్ బీజేపీ కోసం ప్రచారం చేస్తారని ప్రకటనలు చేస్తున్నారు. ఇక తాజాగా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలు..ఎన్టీఆర్‌కు మద్ధతు తెలుపుతున్నారు. అప్పుడు ఎన్టీఆర్‌కూ వెన్నుపోటు పొడిచి..ఇప్పుడు ప్రేమ వలకబోస్తున్నారని, ఇక జూనియర్ ఎన్టీఆర్‌ని అవమానించడం దగా రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ట్వీట్ చేశారు.
అలాగే యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి..వైఎస్సార్ పేరు పెట్టడం ముమ్మాటికి దుర్మార్గమైన చర్య అని అంటున్నారు. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ దక్కించుకోవాలని బీజేపీ కూడా గట్టిగానే ట్రై చేస్తుంది. మరి చివరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్ధతు ఎవరికి ఉంటుందో చూడాలి.