బాసర ట్రిపుల్ ఐటీ లో కొన్ని సమస్యలను పరిష్కరించామని.. మరికొన్ని సమస్యలను ప్రక్షాళన చేసేంతవరకు కొంత సమయం పడుతుందని అన్నారు మంత్రి కేటీఆర్. నేడు బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు మంత్రి. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆయన, అనంతరం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెస్ లో బాత్రూం సహా ట్యాప్ సరిగా లేదన్నారు. తాను కూడా హాస్టల్లో చదివిన వాడినేనని.. హాస్టల్లో ఉండే సాధక బాధకాలు తనకు తెలుసని అన్నారు.
సమ్మె సందర్భంలో బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు అనుసరించిన విధానం తనను ఆకట్టుకుందని తెలిపారు. రాజకీయాలకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా తమ సమస్యలపై తామే పోరాడిన విద్యార్థులను అభినందించారు. మహాత్మా గాంధీ తరహాలో శాంతియుతంగా, వర్షం పడుతుందా లెక్క చేయకుండా బయట కూర్చుని నిరసన తెలియజేయడం చాలా మందికి నచ్చిందని, అందులో తాను ఒకడినని తెలిపారు. మనది ప్రజాస్వామిక దేశం అని, ఏదైనా సమస్య పరిష్కారం కానప్పుడు నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని పేర్కొన్నారు.