రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు అనేవి ఉండాలి…అవి ఉంటేనే ప్రజా సమస్యలు బయటపడతాయి..అలాగే అధికార పార్టీలకు కాస్త భయం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు అనేవి లేకుండా చేస్తే ఇంకా ఏకపక్షమే అని అధికార పార్టీలు ఆలోచిస్తున్నాయి…ఆ దిశగానే రాజకీయం చేస్తున్నాయి..అలాగే తమ అధికార బలాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలని లేకుండా చేసేందుకు చూస్తున్నారు. కానీ అధికార పార్టీలు ప్రతిపక్షాలని ఎంత తోక్కేయాలని చూస్తున్న సరే…ప్రజలే ప్రతిపక్షాన్ని సృష్టిస్తున్నారు. కొత్త ప్రతిపక్షాలు ముందుకొస్తున్నాయి. అవే ఇప్పుడు అధికార పార్టీలకు చుక్కలు చూపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కూడా సేమ్ సీన్ నడుస్తోంది. కేసీఆర్ ఏ స్థాయి నుంచి రాజకీయంగా ఎదుగుతూ వచ్చి..సీఎం అయ్యారో అందరికీ తెలిసిందే…అలాగే ఆయన రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాడారో కూడా తెలిసిందే.
ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చారు కాబట్టే తెలంగాణ ప్రజలు రెండు సార్లు కేసీఆర్ కు సీఎం అయ్యే అవకాశం ఇచ్చారు. ఇలా రెండుసార్లు మంచి ఛాన్స్ వచ్చినప్పుడు..ప్రజలకు అండగా ఉంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి. అదే సమయంలో ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నప్పుడు…ఆ సమస్యల గురించి తెలుసుకుని, వాటిని పరిష్కరించాలి. కానీ కేసీఆర్ అలా చేయలేదు..అసలు తనకు వ్యతిరేకంగా ఏ ప్రతిపక్షం ఉండకూడదని చెప్పి…కాంగ్రెస్, టీడీపీలని రూట్ లెవెల్ లో దెబ్బకొట్టి, వాటిని వీక్ చేశారు. కేసీఆర్ దెబ్బకు టీడీపీ ఉనికి కోల్పోయింది…కాంగ్రెస్ ఏమో కోసం కోన ఊపిరితో కొట్టమిట్టాడే పరిస్తితి.
ఇలా ప్రతిపక్షాలు సరిగ్గా లేకపోయే సరికి కేసీఆర్ కు తిరుగులేదనే పరిస్తితి..స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఏకపక్ష విజయాలు. అయితే ఇదే పరిస్తితి ఉంటే రాచకీయం అవుతుంది తప్ప రాజకీయం అవ్వదు. ఏదో రాజుల పాలన మాదిరే ఉంటుంది…అప్పుడు ప్రజా ప్రభుత్వాలు రాలేవు. అందుకే కేసీఆర్ చేసిన పనులకు ప్రజలే అలెర్ట్ అయ్యారు…వారే ప్రతిపక్షాన్ని తీసుకొచ్చారు. అది కూడా బీజేపీ రూపంలో కొత్త ప్రతిపక్షాన్ని సృష్టించారు.
దేశంలో బలంగా ఉన్న బీజేపీకి…తెలంగాణలో బలం లేదు. ఏ ఎన్నికల్లోనైనా నాలుగైదు సీట్లు గెలుచుకోవడం తప్ప…తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ప్రభావం ఉండేది కాదు. కానీ కేసీఆర్…టీడీపీ-కాంగ్రెస్ లని తొక్కడంతో ప్రజలకు ఆటోమేటిక్ గా బీజేపీని పైకి లేపారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లలో గెలిపించి ఆదరించారు. ఇక అక్కడ నుంచి బీజేపీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. పైగా బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాక..సీన్ మొత్తం మారిపోయింది. ఆయన దూకుడుగా రాజకీయం చేయడం…కేంద్ర పెద్దల సపోర్ట్ దొరకడంతో కేసీఆర్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తూ వస్తున్నారు.
బండితో పాటు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, అరవింద్…ఇలా చెప్పుకుంటూ పోతే నేతలంతా దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. అలాగే బలమైన నేతలు బీజేపీలోకి రావడంతో పార్టీ మరింత బలపడింది. ఇక ఎక్కడైనా అధికార పార్టీని ఉపఎన్నికల్లో ఓడించడం కష్టం..కానీ బీజేపీ…దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓడించింది…కీలకమైన జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటింది. ఇలా అంచలంచెలుగా బీజేపీ ఎదుగుతూ వచ్చింది.
ఇక తాజాగా జరిగిన హైదరాబాద్ లో మోదీ విజయ్ సంకల్ప్ సభ తర్వాత సీన్ మారిపోయింది. టీఆర్ఎస్ పార్టీకి సరైన పోటీ ఇచ్చేది బీజేపీనే అని అర్ధమైంది. సభ ముందు వరకు ఒక ఎత్తు..సభ తర్వాత మరొక ఎత్తు…ఇంకా బీజేపీ స్పీడ్ తగ్గేదేలే అన్నట్లు ఉంది..పైగా కీలక నాయకులకు…కీలక పదవులు దక్కాయి. ఈటల రాజేందర్, డీకే అరుణ కె.లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు చంద్రశేఖర్, కొండా విశ్వేశర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి లాంటి నేతలు…ఇప్పుడు బీజేపీని బలోపేతం చేసే కార్యక్రమాన్ని భుజాన వేసుకొనున్నారు. ఇక్కడ నుంచి ఎన్నికల వరకు బీజేపీ రోజురోజుకూ బలపడుతూ వెళితే..వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి…తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగిరే అవకాశాలు ఉన్నాయి. కమలదళం వెనక్కి తగ్గకుండా పనిచేస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో కమలం వికసించనుంది.