రాష్ట్ర ప్రభుత్వం గురువారం తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర ఖాళీల భర్తీకి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీల్లో ఖాళీల భర్తీకి ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కారు. ఇకపై వర్సిటీల్లోని ఖాళీలన్నీ ఈ బోర్డు ద్వారానే భర్తీ కానున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవలే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లోని ఖాళీల భర్తీని ఎలా చేపట్టాలన్న విషయంపై సుదీర్ఘ కసరత్తు చేసింది ప్రభుత్వం.
ఈ క్రమంలో ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేస్తే బాగుటుందన్న దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బోర్డుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ అధ్యక్షుడిగా వ్యవహరించన్నారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ బోర్డు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. విద్యా శాఖ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. వర్సిటీల్లోని ఖాళీల భర్తీకి ఈ బోర్డే నోటిఫికేషన్లు జారీ చేయనుంది.