బిహార్లోని గంగానదీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 55 మంది ప్రయాణికులతో వెళ్తోన్న పడవ అకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ ఘటనలో పడవలో ప్రయాణిస్తున్న వాళ్లంతా నదిలో పడిపోయారు. పట్నా సమీపంలోని దానాపూర్ పట్టణం షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 10 మంది గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. రాత్రంతా నదిని జల్లెడ పట్టారు. ఎంత వెతికినా గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాలేదని వారు తెలిపారు.
అసలేం జరిగిందంటే.. ప్రతి రోజులాగే ఆదివారం సుమారు 55 మంది పశువుల మేత తెచ్చేందుకు మరికొందరు కూరగాయలు కోసేందుకు గంగాహర ద్వీపానికి బయలు దేరారు. తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పడవ మునిగిపోవడం వల్ల ప్రయాణికులు నదిలోకి దూకేశారు. అందులో ఈత వచ్చిన వారు ఒడ్డుకు చేరాగా మిగిలిన వారు గల్లంతైనట్లు పేర్కొన్నారు. చిన్నబోటులో పరిమితికి మించి ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.