ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం చులకనగా చూస్తోందని AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. ‘మా సహనాన్ని చేతకానితనంగా భావిస్తున్నారు. CM ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరలేదు. ఆలస్యమైనా మాకు మేలు చేస్తారని ఇన్నాళ్లూ చూశాం. మాకేం చేయరని తెలిసింది. అందుకే ఉద్యమంలోకి దిగుతున్నాం. మా ఆందోళనలకు ప్రభుత్వమే కారణం. 20వ తేదీ వరకూ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు’ అని ఆయన వెల్లడించారు. హామీలు నెరవేర్చాలని కోరితే ఆంక్షలతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాము 11వ పీఆర్సీని కోల్పోయామని, ఇస్తున్న రాయితీలను కూడా పోగొట్టుకున్నామని, అయినప్పటికీ ప్రభుత్వానికి సహకరిస్తుంటే ఎంతో చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.
“మీరు మమ్మల్ని శత్రువులుగా చూడొద్దు… మా బాధ, ఆవేదనను అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలందరికీ తెలియజేస్తున్నాను. రేపు మీలో ఎవరైనా మమ్మల్ని ప్రశ్నించదలచుకుంటే మీ ప్రభుత్వ అధినేతను ప్రశ్నించండి. ఉద్యోగులను ఎందుకు రోడ్ల మీదికి తీసుకువచ్చారని మీరు మీ గౌరవ ముఖ్యమంత్రిని అడగండి. మేం దీనికి బాధ్యులం కానే కాదు. ఉద్యోగ సంఘాల నేతలమైన మమ్మల్ని ఉద్యోగులు ఛీ కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మేం ఇంకా సహకరించడం న్యాయం కాదు, ధర్మం కాదు. అందుకే ఇవాళ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తున్నాం” అని వెల్లడించారు.