కరీంనగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పం : గంగుల

-

కరీంనగర్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మానేర్ రివర్ ఫ్రంట్‌ లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక హంగులతో రూ.69 కోట్ల ఏర్పాటు చేయనున్న వాటర్ ఫౌంటైన్ పనులకు ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి మంత్రి గంగుల కమలాకర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. ఎంతో ఘన చరిత్ర ఉన్న కరీంనగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని పేర్కొన్నారు. నగరం తెలంగాణకే టూరిజం స్పాట్‌ గా మారుతుందని మంత్రి తెలిపారు. మాట్లాడుతూ దేశంలోని ఏ నగరానికి లేనివిధంగా 24 టీఎంసీల వాటర్ బాడీ లోయర్ మానేరు డ్యామ్‌ కరీంనగర్ పట్టణాన్ని ఆనుకుని ఉందన్నారు గంగుల కమలాకర్‌.

గత పాలకులు పట్టించుకోక పోవడంతో ఎల్‌ఎండీ పరిసరాల్లో పరిశుభ్రత లేక దుర్గంధాన్ని వెదజల్లేవన్నారు. స్వయం పాలనలో లోయర్ మానేరు జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.310 కోట్లు ఇరిగేషన్, రూ.100 కోట్లు పర్యాటకశాఖకు చెందినవన్నారు. మానేరు నదిపై కేబుల్‌ వంతెన నిర్మాణం పూర్తయ్యిందని, డైనమిక్ లైటింగ్ పనులు మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామని చెప్పారు గంగుల కమలాకర్‌.

రూ.69 కోట్లతో దేశంలోనే తొలిసారిగా భారీ ఐలాండ్‌ ఫౌంటెన్‌ను నిర్మిస్తున్నామన్నారు. ఈ ఫౌంటెన్‌లో ఫైర్‌, లేజర్‌, ప్రొజెక్టర్స్‌ ఉంటాయని, వెయ్యి మంది సామర్థ్యంతో ఆంపీ థియేటర్‌ను నిర్మిస్తున్నట్లు వివరించారు. 40వేల క్యూసెక్కుల నీటితో ప్రొజెక్టర్ ఉంటుందని, ఈ ప్రొజెక్టర్ అర కిలోమీటరు నుంచి కిలోమీటరు దూరం ప్రొజెక్ట్‌ చేస్తుందని, గాలికి నీటి ప్రవాహాన్ని తట్టుకునేందుకు భూమి 100అడుగుల లోతు నుంచి ఈ ఫౌంటెన్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్‌ 2 నాటికి ఫాంటెన్‌ నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు గంగుల కమలాకర్‌.

Read more RELATED
Recommended to you

Latest news