రాష్ట్రంలో సీఎం జగన్‌పై కుట్రలు జరుగుతున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సీఎంపై ప్రతిపక్షాలకు చెందిన కొందరు నేతలు దుర్భాషలాడుతూ అసభ్య పదజాలాలను వాడుతున్నారని మండిపడ్డారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైసీపీ నేతలందరూ కలిసికట్టుగా ఉంటే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే సరిదిద్దుకుని పనిచేయాలన్న బొత్స.. అభిప్రాయ భేదాలుంటే ఇబ్బందులు ఉంటాయన్నారు.
ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో గడప గడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని సీఎం జగన్ చేపట్టారని తెలిపారు బొత్స. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని తెలుసుకుని సవరించి ప్రజలకు మరింత లబ్ధి జరిగేలా చూడాలన్నారు. మహిళలను పూర్తిగా విస్మరించి పెత్తనం సాగిద్ధామని చూస్తే ఊరుకునేది లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. అన్ని కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం ఉండాల్సిందేనన్నారు. పథకాల అమలులో ఎక్కడా అవినీతి ఆరోపణలు లేకుండా సక్రమంగా నిర్వహించాలన్నారు.