శ్రీ‌కాకుళంలో బొత్స మాట ఫ‌లిస్తుందా ?

-

తిరుగులేని నేత బొత్స అని అంటారే
ఆయ‌న మాట కూడా చెల్ల‌డం లేదా ?
ఏమో మ‌రి ! ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో
బొత్స మాట చెల్ల‌దు. ఆ రెండు అన‌గా
ఇచ్ఛాపురం మ‌రియు టెక్క‌లి.
ప‌లాస‌లో కూడా మంత్రి ఎదురీదుతున్నారు.
ఇప్పుడేమౌతుందో ఎప్పుడేమౌతుందో తెలియ‌ని సందిగ్ధ‌త !

అనేక వివాదాల‌కు ఆజ్యం పోసే విధంగా ఇవాళ రాజ‌కీయం ఉంది. ఓ వైపు టీడీపీ మరోవైపు వైసీపీ ఎవ‌రి పంతం వారే నెగ్గించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. పార్టీ పద‌వుల క‌న్నా ప్ర‌భుత్వ ప‌ద‌వుల‌నే ద‌క్కించుకోవాల‌న్న తాప‌త్ర‌యంలో ఉన్నారు. ఈ క్ర‌మంలో జ‌గన్ జిల్లాల ప‌ర్య‌ట‌న చేప‌డితే కొన్ని చోట్ల నెల‌కొన్న స్థానిక స‌మ‌స్య‌లు తెలుస్తాయి. పార్టీ ప‌రంగా, ప్ర‌భుత్వ ప‌రంగా ఆయ‌న‌కు  కొన్ని నిజాలు తెలియ‌డం లేదు.

రీజ‌న‌ల్ కో ఆర్టినేట‌ర్ హోదాలో
బొత్స ఉన్నా కూడా..ఆయ‌న దిద్ద‌లేని
త‌ప్పిదాలే చాలా ఉన్నాయి. ప‌థ‌కాలు క‌న్నా
అభివృద్ధే ముఖ్యం అని నిన‌దిస్తున్న ఉద్దానం ప‌ల్లెలు
ఇప్పుడు అక్క‌డ ఏపీ స‌ర్కారు నిర్మిస్తున్న
మ‌ల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.
 
ఇంట‌ర్న‌ల్ గా జరుగుతున్న కొన్ని రాద్ధాంతాలూ తెలియ‌డం లేదు. ఓ స‌మాచారం మేర‌కు బొత్స వెళ్లి చెప్పినా కూడా ఇప్ప‌టికిప్పుడు ఇచ్ఛాపురంలో కానీ టెక్క‌లిలో కానీ ఇత‌ర ప్రాంతాల‌లో కానీ నెల‌కొన్న అసంతృప్త‌త‌లు అంత వేగంగా త‌గ్గ‌వు. ఆ జ్వాలలు అంత వేగంగా ఆరిపోవు. ఈ నేప‌థ్యంలో  మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ నిన్న‌టి వేళ శ్రీ‌కాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు.

కొన్ని ప్ర‌శంస‌లు ఆనందాన్నిస్తాయి
ప‌థ‌కాలు అంద‌ని వారికి అవే కోపం తెప్పిస్తాయి
గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం పేరిట గుర్తించిన
స‌మ‌స్య‌లు అవి బొత్స స్థాయిలో అధినేత‌కు చేరాల్సినవి
అయితే ఎందుకు చెప్ప‌లేక‌పోయారు ? పిరియా విజ‌య

ఇదే వేదిక‌పై పిరియా విజ‌య (జెడ్పీ చైర్మ‌న్, ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ పిరియా సాయిరాజు భార్య‌) పార్టీ స‌మ‌స్య‌ల‌ను బొత్స‌కు చెప్పారు. పార్టీ పిలుపు మేర‌కు కొంద‌రు కార్య‌క‌ర్త‌లు ప‌నిచేయ‌డం లేదు అని కూడా తేల్చేశారు. అంతా క‌లిసి ప‌నిచేస్తేనే అనుకున్న ల‌క్ష్యాలు సాధించ‌గ‌ల‌మ‌ని చెబుతూ, ఇంకెక్క‌డ విఇవాదం వ‌స్తుందేన‌ని య‌థాలాపంగా చంద్ర‌బాబును తిట్ట‌డం ప్రారంభించి త‌న ప్ర‌సంగాన్ని ఆ తిట్ల‌తోనూ మ‌రియు జ‌గ‌న్ చేపట్టిన ప‌థ‌కాల గొప్ప‌తనాన్ని కీర్తిస్తూ ఆ ప్ర‌శంస‌ల‌తోనూ ముగించారు.

మంత్రి అప్ప‌ల్రాజు ప్ర‌జా వైద్యుడిగా
పేరొందారు కానీ ఒక‌నాటి మాదిరిగా
ఆయ‌న పేరు మార్మోగ‌డం లేదు
కార‌ణం ఇంటి పోరు..ఇంతింత కాద‌యా !
ఇదే సంద‌ర్భంలో విభేదాలుకి తావు లేకుండా 2024 ఎన్నికలలో ఇచ్చాపురం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సిపి జెండా ఎగురవేయాలని కోరారు మ‌రో మంత్రి  సీదిరి అప్ప‌ల్రాజు. కానీ ఆయ‌న నేతృత్వం వ‌హిస్తున్న ప‌లాస‌లో కూడా విభేదాలు అలానే ఉన్నాయి. ఒక‌ప్పుడు అప్ప‌ల్రాజు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వారంతా ఆయ‌న భార్య ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా దూరం అయిపోయారు అన్న విమర్శ‌లూ ఉన్నాయి. మ‌రి ! ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితిని కూడా చ‌క్క‌దిద్ద‌గ‌ల‌రా బొత్స ! అన్న‌దే ఓ ప్రశ్న !
– రత్న‌కిశోర్ శంభుమ‌హంతి – పొలిటిక‌ల్ ఎఫైర్స్

Read more RELATED
Recommended to you

Latest news