రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. జూన్ 30వ తేదీన నామినేషన్ల పరిశీలన, జులై 2న నామినేషన్ల ఉపసంహరణ తేదీని ఖరారు చేసింది. అలాగే రాష్ట్రపతి ఎన్నికకు జులై 18వ తేదీన పోలింగ్, జులై 21న ఫలితాల విడుదల, జులై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
కాగా, ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24వ తేదీన ముగియనుంది. దీంతో పార్లమెంట్‌లో అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ జరగనుంది. ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో 4,986 మంది సభ్యులు ఉండగా.. 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు ఉన్నారు. అయితే బీజేపీని రాజకీయంగా దెబ్బతీయడానికి రాష్ట్రపతి ఎన్నికపై ప్రతిపక్షాలు ఏకం అయ్యాయి. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీలు ఏకమై.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.