గత కొంతకాలంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ బీఆర్ఎస్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్న విషయం తెలిసిందే. బహిరంగంగానే పార్టీపై, ప్రభుత్వం విమర్శలు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. చాలా రోజులుగా పొంగులేటి బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో స్పందించని బీఆర్ఎస్ పార్టీ.. తాజాగా చర్యలకు పూనుకుంది.
తాజాగా వైరా నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పొంగులేటిని కలవడానికి వెళ్లారు. ఈ విషయం అధిష్ఠానానికి తెలియడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. క్రమశిక్షణ చర్యలకు పూనుకుంది. వైరా నియోజకవర్గంలో 20మంది నాయకులపై బీఆర్ఎస్ చర్యలు తీసుకుంది. రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్‌ను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించింది. వైరా పురపాలక ఛైర్మన్ జైపాల్‌తో పాటు 18 మందిని సస్పెండ్ చేసింది. పొంగులేటితో సమావేశమైన నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయా మండల పార్టీ అధ్యక్షులు ప్రకటించారు.