BRS పార్టీ ఆవిర్భావం జరిగిన నాటి నుంచి ఈ పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ నెలాఖరు నుంచి దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు మరింత స్పీడ్ పెంచనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ధనుర్మాసం ప్రారంభమవుతుందన్న ఉద్దేశంతో ఆ లోపే పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించి దిల్లీలో వేదిక సిద్ధం చేయాలన్న ఆలోచనతో ఉన్న అతికొద్ది సమయంలోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్టు పేర్కొన్నాయి.
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అన్న నినాదంతో ముందుకు పోవాలని పార్టీ ఆవిర్భావం రోజు హైదరాబాద్‌లో ప్రకటించిన అధినేత కేసీఆర్.. అందుకు అనుగుణంగా ముందస్తుగా ఆరు రాష్ట్రాల్లో పార్టీ అనుబంధంగా భారత రాష్ట్ర కిసాన్ సమితి విభాగాలను ప్రారంభించాలని నిర్ణయించారు. క్రిస్మస్ పండగ తర్వాత ఆయా రాష్ట్రాల్లోని భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, నేపథ్యాలను అనుసరించి అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు ఎలాంటి విధానాలు అవలంభించాలన్న విషయమై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఆ ఆదిశగా నేతలను సమాయత్తం చేస్తున్నారు. నెలాఖరు కల్లా పంజాబ్, హరియాణా, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీఆర్ఎస్ కిసాన్ సెల్‌లను ప్రారంభిస్తారని పార్టీ నేతలు తెలిపారు.