మగువకు ఆకాశంలో సగం.. అవకాశంలో సగం కావాలి : ఎమ్మెల్సీ కవిత

-

భారత సంస్కృతిలో మహిళకు పెద్దపీట వేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అమ్మానాన్న అంటాం.. అమ్మ శబ్దమే ముందు ఉంటుందని చెప్పారు. చట్టసభల్లో మహిళకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలనే డిమాండ్​తో దిల్లీలోని జంతర్ మంతర్​లో కవిత దీక్ష చేస్తున్నారు. జాతీయ నేతల విగ్రహాలకు పూలమాల వేసి కవిత నివాళులు అర్పించారు. అనంతరం సీపీఎం నేత సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించారు.

రాజకీయాల్లోనూ మహిళకు సముచిత స్థానం దక్కాలని కవిత ఆకాంక్షించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. 1996లో దేవెగౌడ హయాంలో బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

“దీక్షకు మద్దతు తెలుపుతున్న అందరికీ కృతజ్ఞతలు. మహిళా రిజర్వేషన్‌ సాధించే వరకూ విశ్రమించేది లేదు. బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి. మహిళాబిల్లు ఓ చారిత్రక అవసరం.. సాధించి తీరాలి. జంతర్‌మంతర్‌లో మొదలైన పోరాటం.. దేశమంతా వ్యాపించాలి.” – కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

Read more RELATED
Recommended to you

Latest news