ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలకు ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే.. ఏపీ ఆర్థిక నిర్వహణపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిందంటూ విపక్ష టీడీపీ చేసిన ఆరోపణలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు టీడీపీ చేసిన ఆరోపణలకు సంబంధించి అంశాల వారీగా శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కాగ్ అభ్యంతరాలు లేవనెత్తిన మాట వాస్తవమేనన్న బుగ్గన… ఆ అభ్యంతరాలన్నీ విధానపరమైనవేనని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలపై కాగ్ ఎక్కడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని బుగ్గన చెప్పారు.
కాగ్ లేవనెత్తిన విధానపరమైన అభ్యంతరాలు కూడా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సీఎంఎఫ్ఎస్ అని ఆరోపించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. టీడీపీ పాలన, కరోనా వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బ తిన్నదన్నారు. 2015 నుంచి 2021 మధ్య కాలంలోనే కాగ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. బుక్ అడ్జస్ట్ మెంట్ల లావాదేవీలు గుర్తించేందుకే ప్రత్యేక బిల్లులను ప్రస్తావించిందన్నారు. కాగ్ లేవనెత్తిన రూ.26,839 కోట్ల విలువైన ప్రత్యేక బిల్లులు అసలు నగదు లావాదేవీలే కాదని ఆయన తెలిపారు. ఆర్థిక లావాదేవీల్లో ఎక్కడ కూడా ట్రెజరీ కోడ్ ఉల్లంఘన జరగలేదని వివరించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.