మరోసారి వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన గోరంట్ల బుచ్చయ్య

-

పోలీసు శాఖ ప్రమోషన్లలో.. ప్రత్యేకించి డీఎస్పీ ప్రమోషన్లలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారని టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ మేరకు బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీల ప్రమోషన్లపై కీలక వివరాలు వెల్లడించారు. టీడీపీ హయాంలో ఒకే కులానికి పదవులు కట్టబెట్ట లేదని సాక్షాత్తు హోం శాఖ మంత్రి హోదాలో మేకతోటి సుచరిత అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను గుర్తు చేశారు బుచ్చయ్య చౌదరి. అంతేకాకుండా డీఎస్పీల ప్రమోషన్లలో చంద్రబాబు ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదని సుచరిత చెప్పారన్నారు బుచ్చయ్య చౌదరి. ఈ మేరకు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సుచరిత లిఖితపూర్వక సమాధానం ఇచ్చారని ఆయన చెప్పారు.

29 సబ్‌ డివిజన్లలో 19 మంది జగన్ సొంత కులం వారే ఉన్నారన్నారు. ఒక్క కాపుకు కూడా పోస్టింగ్‌ ఇవ్వలేదన్నారు. ప్రముఖ పట్టణాల్లో ఒక్క బీసీకి, ఎస్సీకి గానీ పోస్టింగ్‌ లేదన్నారు. ప్రతి ప్రాంతంలోనూ జగన్ తన సొంత సామాజికవర్గానికే పోస్టింగ్‌లు ఇచ్చారన్నారు. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా ఫరవాలేదు అన్న విధంగా జగన్‌రెడ్డి తన సొంత సామాజికవర్గాన్ని పెంచి పోషిస్తూ బడుగు బలహీనవర్గాలను జేసీబీలతో, రోడ్డు రోలర్లతో అణగదొక్కుతున్నారని విమర్శించారు బుచ్చయ్య చౌదరి.

 

దీనికి వ్యతిరేకంగా చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టారని ఆరోపించిన సీఎం జగన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బుచ్చయ్య చౌదరి. చంద్రబాబుపై నాడు జగన్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా తేలిపోయిందని బుచ్చయ్య చౌదరి అన్నారు. డీఎస్పీ ప్రమోషన్లలో 37 మందిలో 35 మందికి ఒకే సామజిక వర్గానికి చంద్రబాబు ప్రమోషన్లు ఇచ్చారనడం అసత్యమని ఆయన తెలిపారు. నాటి డీఎస్పీ ప్రమోషన్‌ లలో 17 మంది ఓసీ, 12 మంది బీసీ, ఆరుగురు ఎస్సీ, ఒక ఎస్టీ ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో సొంత సామాజికవర్గానికి పోస్టింగ్‌ వేయించుకుంటోందని ఆయన ఆరోపించారు. మంగళవారం 53 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌ వేయగా, అందులో 25% మంది జగన్ సొంత సామాజికవర్గం వారే ఉన్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version