తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందా ? ఇక్కడ పార్టీని పట్టించుకునే నాయకుడు ఎవరూ కనిపించడం లేదా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గత ఏడాది ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీలు విజయం సాధించారు. ఇక, రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి మాగంటి రూపాదేవి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఇప్పుడు ఇక్కడ జెండా మోసే పరిస్థితి కనిపించడం లేదు. ఓడిపోయిన రూపాదేవి.. ఏకంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆమెకు రాజకీయాలు చేయాలని ఉన్నప్పటికీ.. మామ.. మురళీ మోహన్ సలహా మేరకు ఆమె సొంత వ్యాపారాలకు మాత్రమే పరిమితమయ్యారు.
ఇక, అసెంబ్లీ నియోజకవర్గాలు రెండింటిలోనూ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కినా.. ఎవరికివారే యమునాతీరే అన్నవిధంగా నాయకులు వ్యవహరిస్తున్నారు. ఆదిరెడ్డి భవానీ.. మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్న ఎర్రన్నాయుడు కుమార్తె. ఇటీవల అచ్చెన్న అరెస్టు అయిన తర్వాత పార్టీ నుంచి సరైన సపోర్ట్ లేదన్న ఆవేదనలో ఈ కుటుంబం ఉంది. పైగా ఆమె నియోజకవర్గంలోనూ యాక్టివ్ రోల్ పోషించలేక పోతున్నారు. ఎంపీ భరత్ రామ్ దూకుడు ముందు ఆమె మైనస్ అయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా భర్త చాటు భార్యగా మారిపోయారన్న టాక్ కూడా ఆమెపై ఉంది.
అదే సమయంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల కేవలం మీడియా చర్చలకే పరిమితమయ్యారు. వయసు పైబడడంతో ఆయనకు కరోనా భయం వెంటాడుతోంది. ఇంటి నుంచి బయటకు వస్తే.. తనకు ఎక్కడ వైరస్ అంటుకుంటుందోనని ఆయన తెగ ఫీలవుతున్నారని అంటున్నారు. ఇక, నియోజకవర్గంలోనూ ఆయన డామినేషన్ ఎక్కడా కనిపించడం లేదు. ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆయన ఎక్కడా పనులు చేయలేక పోతున్నారని అంటున్నారు.
ఇక, ఆయన కూడా ఎలాగూ రిటైర్మెంట్ స్టేజ్‌కు వచ్చేశాను. పార్టీలోనూ నాపై ఆధారపడ్డవారు ఎవరూ లేరు.. అనే నిరాశ తొంగి చూస్తోంది. దీంతో ఆయన కూడా మౌనంగానే ఉంటున్నారు. ఇక రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య తన సిటీ నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారన్న అసంతృప్తితో ఉన్న భవానీ, ఆమె భర్త వాసు ఇప్పటికే చంద్రబాబుకు ఫిర్యాదు చేశారన్న టాక్ కూడా ఉంది. వీటితో పాటు చంద్రబాబు ఎలాంటి పిలుపు ఇచ్చినా.. ఆయన మాట లైట్ తీస్కోవడంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించే నాయకులు కూడా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.