తెలంగాణలో అధికార టీఆర్ఎస్లో పదవుల జాతర నడుస్తోంది. వరుసపెట్టి పార్టీ నేతలకు పదవుల పంపకాలు చేయడంలో సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారు. అయితే ఈ పదవుల పంపకాలతో నేతల్లో ఉన్న అసంతృప్తిని తొలగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే మూడోసారి అధికారంలోకి రావాలంటే..సొంత పార్టీ నేతలని కూడా సంతృప్తి పరచాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉంది. పదవులు ఇవ్వకపోతే నేతలు అసంతృప్తితో ఉండి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పెద్దగా పనిచేయరు. అందుకే కేసీఆర్ పదవుల పంపకాలు మొదలుపెట్టారు.
ఇప్పటికే ఎమ్మెల్సీ పదవుల భర్తీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. అలాగే విడతల వారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా చేస్తున్నారు. ఇదే క్రమంలో త్వరలోనే మంత్రివర్గంలో కూడా మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. అంతకంటే ముందు ఈటల రాజేందర్ బెర్త్‌ని భర్తీ చేయాలి. ఈటలని మంత్రివర్గం నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈటల టీఆర్ఎస్ని వీడి బీజేపీలో చేరడం, హుజూరాబాద్‌లో గెలవడం జరిగిపోయాయి.
ఇక ఈటల శాఖని హరీష్ రావు చూసుకుంటున్నారు. కానీ క్యాబినెట్లో ఒక బెర్త్ మాత్రం ఖాళీగానే ఉంది. ఆ ఖాళీని పూరించాలని కేసీఆర్ చూస్తున్నారు. అది కూడా మాజీ టీడీపీ నేతలతో భర్తీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అసలు సగం మందిపైనే నేతలు టీడీపీ నుంచి వచ్చిన వారే..ఇదే క్రమంలో టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యని క్యాబినెట్లోకి తీసుకోవాలని కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ఇటీవల ఎల్ రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. అవకాశం దొరికితే రమణకు క్యాబినెట్ ఆఫర్ కూడా ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. ఇటు కడియం శ్రీహరి సైతం క్యాబినెట్ బెర్త్ కోసం కాచుకుని కూర్చున్నారు. మరి వీరిలో కేసీఆర్ ఎవరిని క్యాబినెట్లోకి తీసుకుంటారో చూడాలి. ఏ మాజీ సైకిల్ నేతకు కారు ఓనర్ కేసీఆర్ ఛాన్స్ ఇస్తారో?