ఆన్లైన్ బెట్టింగ్ యాప్ మాఫియా ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతోంది. ఎందరో అమాయక యువతి వీటి బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై పలు రాష్ట్రాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఏ రకంగా వీటిలో భాగమైన వారైనా సరై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా బెట్టింగ్ యాప్ కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
బెట్టింగ్ యాప్ కుంభకోణం లబ్దిదారుల్లో బఘేల్ కూడా భాగమైనట్లు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేసు నమోదు చేసింది. గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా తన ఎఫ్ఐఆర్ లో ఇదే విషయాన్ని పొందుపరిచింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో భూపేశ్ బఘేల్ పై భారత శిక్షాస్మృతిలోని 120-B (నేరపూరిత కుట్ర), మోసం (420), ఛత్తీస్‌గఢ్ జూదం నిషేధ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఆయణ్ను 19 మంది నిందితుల్లో ఆరో వ్యక్తిగా పేర్కొంది. సీబీఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను బఘేల్ ఖండిస్తూ.. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు.