ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు డిసెంబర్ 24 న 78 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. అయితే శ్రీనగర్ కాలనీలో నివాసం ఉన్న చలపతిరావు ఇటీవల అనారోగ్యం కారణంగా తన కొడుకు రవిబాబు ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. అక్కడే చికెన్ బిర్యాని తిని ఆ తర్వాత గుండెపోటుతో మరణించారు అని ప్రముఖ నటుడు డైరెక్టర్ చలపతిరావు కొడుకు అయిన రవి బాబు మీడియాతో తెలిపారు. దాదాపు 1200 చిత్రాలలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న చలపతిరావు.. నేడు ఇండస్ట్రీ వదిలి వెళ్ళడం నిజంగా బాధాకరమని చెప్పాలి.
ఈరోజు ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగబోతున్నాయి. ఆయన ఇద్దరు కుమార్తెలు మంగళవారం రాత్రి అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో ఈరోజు ఉదయం ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నట్లు రవిబాబు వెల్లడించారు. ముఖ్యంగా చలపతిరావు కుమారుడు రవిబాబు ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఒకవైపు కైకాల సత్యనారాయణ మరొకవైపు చలపతిరావు మరణం రెండిటినీ కూడా ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. అయితే ఈ ఇద్దరి దిగ్గజనటులకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు.
సినీ ఇండస్ట్రీలో ఈయన మృతితో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ , వెంకటేష్ సినీ రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయన మృతికి నివాళులు అర్పించారు. ఇకపోతే నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా కొనసాగుతున్న రవిబాబు తండ్రి అంత్యక్రియలను దగ్గరుండి పూర్తి చేయబోతున్నారు. ఇకపోతే డిసెంబర్ 24న చలపతిరావు మరణించినప్పటికీ ఇద్దరు కూతుర్లు అమెరికాలో ఉండడం వల్ల వారు రావడానికి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అప్పటివరకు పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఫ్రీజర్ లో ఉంచారు. ఈరోజు అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు.