ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వానికి గడువు ముగిసిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి వ్యవహారంపై కోర్టులు ఏమి తేల్చలేవని,ఎన్నికల్లో ఏమి చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.ఎన్నికల్లోగా తీర్పు వచ్చే అవకాశం ఉండకపోవచ్చన్నారు. రాష్ట్రంలో విషయాలన్నీ కోర్టులకు తెలుసన్నారు. ఓ మూర్ఖుడి పైశాచిత ఆనందంతో అమరావతి తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర విభజన కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి తీరుతో నష్టం జరుగుతోందని అన్నారు. రాష్ట్రానికి విభజన వల్ల నష్టపోయిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ నష్టం, నాలుగేళ్లలో రాష్ట్రానికి జగన్ వల్ల జరిగిందని ఆరోపించారు.
ఒక విజన్‌తో నాడు హైదరాబాద్‌ను అభివృద్ది చేశామని ఆ ఫలితాలు మన కళ్ల ముందు ఉన్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి రాజధాని మనకు ఉండాలని, పెట్టుబడులకు, ఉద్యోగాల కల్పనకు కేంద్రం కావాలని తాను అమరావతిని తలపెట్టినట్లు చెప్పారు. అయితే జగన్ తన కక్ష పూరిత రాజకీయాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని అన్నారు. దీని వల్ల నష్టపోయింది ప్రజలు, రాష్ట్రం కాదా? అని ప్రశ్నించారు. ప్రజల ఆస్తిని నాశనం చేసే హక్కు జగన్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు రాజధాని కేసు డిసెంబర్‌కు వాయిదా పడిందని, అది ఎప్పుడు తేలుతుందో తెలీదు అని అన్నారు. ఈ కారణంగా 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేసిన పాపం జగన్ దే అని చంద్రబాబు తేల్చిచెప్పారు. తెలంగాణలో మారుమూల ప్రాంతంలో కూడా ఎకరం అమ్మితే రూ.50 లక్షలు వస్తుందని, కానీ నేడు ఏపీలో 10 ఎకరాలు అమ్మినా ఆ సొమ్ము వచ్చే పరిస్థితి లేదు అన్నారు. ఒక కియా పరిశ్రమ తెస్తే అక్కడ భూములు రేట్లు పెరిగాయి, సంపద సృష్టి అంటే ఇదే కదా అని వ్యాఖ్యానించారు. ఒక మూర్ఖుడి నిర్ణయానికి తెలుగు జాతి బలి అవ్వాలా? దీనిపై జనం మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు. తాను ఈ వ్యాఖ్యలు జగన్‌పై ఉక్రోషంతో చేయడం లేదని, జరుగుతున్న నష్టం వల్ల అవేదనతో అంటున్నాను అని చంద్రబాబు అన్నారు.