వైసీపీ అధినేత, సీఎం జగన్ సొంత జిల్లాలో టీడీపీని అభివృద్ధి బాటలో నడిపించాలని, అక్కడ వైసీపీకి డిపాజిట్లు కూడాదక్కకుండా చేయాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యం. ఈ క్రమంలోనే గత తన పాలనలో చాలా సమయాన్ని కడప కోసం కేటాయించారు. అయినప్పటికీ.. ఫలితం రాబట్టలేక పోయారు. అంతేకాదు.. కీలక నేతలను సైతం ఇక్కడ ప్రయోగించారు. సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి వంటివారికి అధికారం బాగానే కట్టబెట్టారు. కానీ, అనుకున్నది మాత్రం సాదించలేక పోయారు. గత ఎన్నికల్లో ఒక్క చోట కూడా గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు.
అయితే, ఇప్పుడు మరోసారి.. కడపపై తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. దీనిలో భాగంగా తాజాగా టీడీపీ రాష్ట్ర కమిటీలో కడప జిల్లాకు చెందిన వారికి ఎక్కువ పదవులు కట్టబెట్టారు. ఒక్క కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 14 మందికి రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించారు. వారిలో పదిమంది జిల్లాకు చెందిన నేతలు కాగా.. మరో నలుగురు రాజంపేట పార్లమెంట్ స్థానం పరిధిలో వచ్చే చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు.
కడప జిల్లాకు చెందిన ఆర్.శ్రీనివాసరెడ్డికి పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు, తెలుగు మహిళా అధ్యక్షులను ఎంపిక చేశారు. 2009లో టీడీపీలోకి వచ్చిన సీనియర్ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి, రాజంపేట ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులుకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఎమ్మెల్సీ బీటెక్ రవికి కీలకమైన రాష్ట్ర అధికార ప్రతినిధి స్థానం ఇచ్చారు. బీటెక్ రవికి పెద్ద బాధ్యతనే అప్పగించారు. సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఈయనపై ఉంది.
ఇక, పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతున్న బాలిశెట్టి హరిప్రసాద్‌తో పాటు సీనియర్ నేతలు ఎస్.గోవర్ధనరెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డిని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా నియమించారు. కమలాపురానికి చెందిన బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కాశీభట్ల సాయినాథ్‌శర్మకు తొలిసారిగా రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించారు. మొత్తానికి ఈ కూర్పు బాగున్నా.. చంద్రబాబు వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.