టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చుంటే మొదటి నెల నుంచే రూ.3 వేల పెన్షన్ ఇచ్చేవాళ్లమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆదివారం గుంటూరు వికాస్ నగర్ లో భారీ బహిరంగ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పేదలకు చంద్రన్న కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నాడు పేదలకు రూ.30 పెన్షన్ ఇచ్చారని, ఆ తర్వాత తాను అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రూ.75 చేశానని, అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ పెన్షన్ ను రూ.200కి పెంచాడని, తాను మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక రూ.200గా ఉన్న ఆ పెన్షన్ ను ఐదేళ్లలో రూ.2 వేలు చేశానని చంద్రబాబు వివరించారు. పేదలపై టీడీపీకి ఉన్న ప్రేమకు అదే నిదర్శనమని తెలిపారు. “మేము 54 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే, ఇప్పటి ప్రభుత్వం రూ.3 వేలకు పెంచుతామని చెప్పింది.
ఒక ఇంట్లో ఎంత మంది అర్హులు ఉన్నా మేం అందరికీ పెన్షన్ ఇస్తే, ఈ ప్రభుత్వం ఇంట్లో ఒకరికే ఇస్తోంది. పేదలు పండుగల చేసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు అడ్డొస్తాయని భావించి క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా ఇచ్చాం. చంద్రన్న బీమా తెచ్చాం. ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోతే తక్షణమే రూ.5 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేశాం. మట్టి ఖర్చులకు రూ.30 వేలు ఇచ్చాం. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చుంటే మొదటి నెల నుంచే రూ.3 వేల పెన్షన్ ఇచ్చేవాళ్లం. పెంచుకుంటూ పోతానని మాటలు చెప్పిన ఈ ముఖ్యమంత్రి ధరలు పెంచుకుంటూ పోతున్నాడు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ బొక్క పెట్టాడు. ఈసారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం… అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని సభాముఖంగా చెబుతున్నా” అని వెల్లడించారు చంద్రబాబు.